సర్కార్ స్కూళ్లలో ఏఐ శిక్షణ.. పైలట్ ప్రాజెక్టుగా సూర్యాపేట జిల్లాలో అమలు

సర్కార్ స్కూళ్లలో ఏఐ శిక్షణ.. పైలట్ ప్రాజెక్టుగా సూర్యాపేట జిల్లాలో అమలు
  • మొదట నాలుగు పాఠశాలల్లో ప్రారంభం
  • 15 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ
  • విడతల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరణ లక్ష్యం

సూర్యాపేట, వెలుగు:  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విద్యను అందించేందుకు సూర్యాపేట జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా కార్పొరేట్ స్థాయి సాంకేతిక విద్యను అందుకోవాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  

సూర్యాపేట జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ శిక్షణను ప్రవేశపెడుతున్నారు. తొలి దశలో సూర్యాపేట, కుడకుడ, కోదాడ, నేరేడుచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించి ఏఐ శిక్షణకు అవసరమైన మౌలిక వసతులను సిద్ధం చేశారు.

నేటి నుంచి ప్రత్యేక తరగతులు

ఎంపిక చేసిన పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న సుమారు 1,200 మంది విద్యార్థులకు 15 రోజుల పాటు ప్రత్యేక ఏఐ తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకోసం బీటెక్, మాస్టర్ ఆఫ్ డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్ తదితర ఉన్నత కోర్సులు పూర్తి చేసిన 15 మంది వాలంటీర్లను ఎంపిక చేశారు. డిజిటల్ ల్యాబ్‌‌ల ద్వారా విడతల వారీగా శిక్షణ అందించనుండగా, రోజూ గంటపాటు విద్యార్థులకు ఏఐ మౌలిక అంశాలపై అవగాహన కల్పిస్తారు.

మ్యాథ్స్‌‌, సైన్స్‌‌లో నైపుణ్యాల పెంపు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సులపై సరైన అవగాహన లేకపోవడం వల్ల పోటీ పరీక్షల్లో వెనుకబడుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బట్టీ పద్ధతికి బదులుగా విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచన, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించేందుకు ఏఐ ఆధారిత శిక్షణ. అందించ నున్నారు. ముఖ్యంగా మ్యాథ్స్‌‌, సైన్స్ సబ్జెక్టుల్లోని క్లిష్టమైన అంశాలను సులభంగా అర్థం చేసుకుని, కొత్త పద్ధతుల్లో పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించారు.

ఈ కార్యక్రమం విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా భవిష్యత్తులో సాంకేతిక రంగంలో రాణించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఏఐ ఎంతో కీలకం: కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు రాణించాలంటే ఏఐ నైపుణ్యం  అత్యంత కీలకం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక అవకాశాలు అందించాలన్నదే మా లక్ష్యం. ఈ శిక్షణ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, దేశ డిజిటల్ పరివర్తనలో వారిని భాగస్వాములను చేస్తుంది. భవిష్యత్ సాంకేతికత వైపు వారిని నడిపించే కీలక అడుగుగా ఇది నిలుస్తుంది.