ర్యాగింగ్ చేసిన మెడికోల సస్పెన్షన్

ర్యాగింగ్ చేసిన మెడికోల సస్పెన్షన్

సూర్యాపేట మెడికల్ కాలేజ్ లో జరిగిన  ర్యాగింగ్ ఘటనకు బాధ్యులను గుర్తించిన అధికారులు ఆరుగురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఏడాది పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు కాలేజీ హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాలేజీలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. డీఎంఈ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ కమిటీ వెంటనే రంగంలోకి దిగిన కమిటీ కాలేజీని, హాస్టల్ ను సందర్శించి విచారించింది.

బాధిత  విద్యార్థి ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఐదుగురు విద్యార్థులపై ఐపీసీ సెక్షన్ 342, 323, 352, 504, 506 తెలంగాణ ప్రొహిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. పోలీసు కేసు గురించి కూడా విచారించిన కమిటీ.. మొత్తం ఆరుగురు మెడికోలు బాధ్యులుగా గుర్తించింది. వారిని కాలేజీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని, అలాగే హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగించాలని సిఫారసు చేసింది. కమిటీ సిఫారసుపై స్పందించిన సూర్యాపేట మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆరుగురు విద్యార్థులపై చర్య తీసుకున్నారు.