మునగాల/మోతె, వెలుగు : సూర్యాపేట జిల్లా మునగాల, మోతె మండలాల్లో సోమవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు చనిపోగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం వెంకటరాంపురం గ్రామానికి చెందిన కీత రాజయ్య (71) తన కూతురు, పెన్‌పహాడ్ మండలం రంగయ్యగూడెం గ్రామానికి చెందిన సాలె సునీత (40)తో కలిసి బ్యాంక్ పనిమీద మునగాలకు వచ్చాడు. పని ముగించుకొని తిరిగి టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై వెళ్తూ... మొద్దుల చెరువు స్టేజీ వద్దకు రాగానే కోదాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది.
దీంతో రాజయ్య అక్కడికక్కడే చనిపోగా, సునీత తీవ్రంగా గాయపడింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని 108లో సునీతను సూర్యాపేట ఏరియా హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది.
కారు, లారీ ఢీకొని వదిన, మరదలు..
లారీ కారును ఢీకొట్టడంతో వదిన మరదలు చనిపోయారు. ఈ ప్రమాదం మోతె మండలం రాఘవాపురం ఎక్స్‌రోడ్డు వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన రామిశెట్టి వెంకటరామమ్మ (63) తన బంధువు వెంకాయమ్మ (68)తో కలిసి రెండు రోజుల కింద హైదరాబాద్‌లోని తన కొడుకు రామిశెట్టి వెంకట కిశోర్‌బాబు వద్దకు వెళ్లింది.
సోమవారం వెంకట కిశోర్‌బాబు తన సొంత కారులో వారిద్దరినీ ఎక్కించుకొని ఖమ్మం వస్తున్నాడు. రాఘవాపురం ఎక్స్‌రోడ్డు వద్దకు రాగానే నవత ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటరామమ్మ అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడ్డ వెంకాయమ్మ హాస్పిటల్‌కు తరలిస్తుండగా చనిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్పీ నర్సింహ ప్రమాద స్థలాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
