పాకిస్థాన్ ను ఏకాకిగా మార్చిన ఘనత మోడీదే : సుష్మా స్వరాజ్

పాకిస్థాన్ ను ఏకాకిగా మార్చిన ఘనత  మోడీదే : సుష్మా స్వరాజ్

హైదరాబాద్ : ప్రపంచంలో పాకిస్థాన్ ను ఏకాకిగా మార్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోడీదే అన్నారు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్. సికింద్రాబాద్ హర్యానా భవన్ లో లింగ్విస్టిక్ మైనారిటీస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. “సికింద్రాబాద్ నుంచి దత్తాత్రేయను నాలుగు సార్లు గెలిపించారు. ఈసారి కిషన్ రెడ్డిని గెలిపించుకుంటారని నమ్మకం ఉంది. దేశ రక్షణ..అభివృద్ధి.. ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కసారి పరిశీలించి ఓటు వేయండి. గత ప్రభుత్వాల హయాంలో బాంబు పేలుళ్లతో దేశం అల్లకల్లోలంగా మారిపోయింది. బీజేపీ హయాంలో పుల్వామా ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనె సర్జికల్ స్ట్రైక్ తో పాకిస్తాన్‌కు కేంద్రం సమాధానమిచ్చింది. ఈ విషయంలో 17 దేశాలు భారత్ కు అండగా నిలిచాయి. మన సైనికులను అభినందించాలి” అన్నారు సుష్మా స్వరాజ్.

“సర్జికల్ స్ట్రైక్ విషయంలో కేసీఆర్… పాకిస్తాన్ మాటలు నమ్ముతున్నారు. పుల్వామా.. సర్జికల్ స్ట్రైక్ వంటి కీలకమైన ఘటనలు జరిగినా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ పట్టనట్లు వ్యవహరించారు. తీవ్రవాదుల దాడులను ఖండించని రాహుల్ SPG భద్రతను వదులుకోవాలి. ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం కాంక్షిస్తుంది. ప్రతి ఒక్కరి అభివృద్ధే దేశ అభివృద్ధి అనేది ప్రధాని నినాదం. పేద మహిళల ఆత్మగౌరవం కోసం 13 కోట్ల టాయిలెట్లను నిర్మించింది మా ప్రభుత్వం” అన్నారు సుష్మ.