
దేశంలో మంకీపాక్స్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే నలుగురికి నిర్ధారణ కాగా.. తాజాగా మరో అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరియా జిల్లాకు చెందిన ఓ మహిళలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు మంకీపాక్స్ లక్షణాలు కనిపించటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి శాంపిల్స్ సేకరించారు. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి శాంపిల్స్ పంపించారు. మంకీపాక్స్ అనుమానిత కేసు బయటపడటంతో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొవిడ్ హాస్పిటళ్లలో మంకీపాక్స్ చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.
దేశంలో ఇప్పటి వరకు 4 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 3 కేరళలో వెలుగు చూడగా.. ఢిల్లీలో ఒకరికి ఈ వైరస్ సోకింది. తాజాగా యూపీలో అనుమానిత కేసు నమోదుకావడంతో ఇతర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు్ల్లో నిఘా కట్టుదిట్టం చేశాయి. ఈ నెల 23న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి.