
- ముంచుకొస్తున్న గడువు
- వీడని ఖమ్మం పీటముడి
- కరీంనగర్ పైనా నో క్లారిటీ
- ఎల్లుండే నామినేషన్లకు ఆఖరు
- గంట గంటకూ పెరుగుతున్న ఉత్కంఠ
- తెరపైకి కొత్త కొత్త పేర్లు
హైదరాబాద్: మూడు సీట్లకు అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీకి కత్తిమీద సాములా మారింది. కీలక నేతలు పట్టుబడుతుండటంతో ఎవరిని ఎంపిక చేయాలనే తర్జనభర్జన ఇంకా కొనసాగుతూనే ఉంది. నామినేషన్లకు ఎల్లుండే చివరి రోజు కావడం, ఇంత వరకు అభ్యర్థులెవరనేది అధినాయకత్వం తేల్చకపోవడంతో క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఖమ్మం సీటు కోసం పట్టుబట్టుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి నిన్న బెంగళూరులో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఎటూ తేలకపోవడంతో అట్నుంచి అటే ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది. ఏఐసీసీ అగ్రనేతలతో చర్చించి టికెట్ తమకే దక్కేలా ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
కుదరని సయోధ్య
ఖమ్మం సీటు తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి కేటాయించాలని పొంగులేటి డిమాండ్ చేస్తుండగా.. తన సతీమణి నందినికి ఇవ్వాలని భట్టి పట్టుబట్టుతున్న విషయం తెలిసిందే. మరో మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కూమార్ పేర్లు తొలుత వినిపించాయి. ఇద్దరూ వేరే వ్యక్తుల పేర్లను ప్రతిపాదించాలని అధిష్టానం సూచించడంతో పొంగులేటి తన వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి పేరును ప్రపోజ్ చేసినట్టు తెలుస్తోంది. భట్టి విక్రమార్క రాయల నాగేశ్వరరావు పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
కరీంనగర్ పైనా క్లారిటీ రాలే
కరీంనగర్ పార్లమెంటు సీటుపైనా క్లారిటీ రాలేదు. ఈ సీటు కోసం వెలిచాల రాజేందర్, అల్గిరిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతున్నారు. నిన్న వెలిచాల రాజేందర్ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులతో అట్టహాసంగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఇంతకూ వెలిచాలకే అధిష్టానం ఖరారు చేస్తుందా..? అల్గిరిరెడ్డిని బరిలోకి దించుతుందా..? అనేది సస్పెన్స్ గా మారింది.
పట్నంలో లైన్ క్లియర్?
హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలోనూ గందరగోళం నెలకొంది. డీసీసీ ప్రెసిడెంట్ సమీరుల్లాకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఖమ్మం టికెట్ ఫైనల్ అయితే మిగతా రెండు స్థానాలది పెద్ద విషయమేం కాదని కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఒకరు చెప్పారు.