కాంగ్రెస్​ లిస్ట్​పై సస్పెన్స్.. ఖర్గే నేతృత్వంలో సీఈసీ భేటీ

కాంగ్రెస్​ లిస్ట్​పై సస్పెన్స్.. ఖర్గే నేతృత్వంలో సీఈసీ భేటీ
  • రాష్ట్రంలో 6-7 సీట్లకు అభ్యర్థులపై క్లారిటీ!
  • మిగతా స్థానాలపై కుదరని ఏకాభిప్రాయం
  • పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికే వదిలేసిన నేతలు
  • నేడో, రేపో జాబితా విడుదల చేసే అవకాశం

న్యూఢిల్లీ, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతున్నది. స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించిన పేర్లలో కొన్నింటిలో నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు నిర్ణయాధికారాన్ని అప్పగించినట్లు తెలిసింది. మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీసులో ఖర్గే నేతృత్వంలో సీఈసీ భేటీ జరిగింది. ఇందులో అగ్రనేత సోనియా, కేసీ వేణుగోపాల్, అంబికా సోని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. 

తెలంగాణతో సహా కర్నాటక, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, చండీగఢ్, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 70 లోక్‌‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై వేరు వేరుగా చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, దీపాదాస్ మున్షీ, కర్నాటక నుంచి సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధ్యక్షులు పాల్గొన్నారు. 

ఫస్ట్ మీటింగ్​ లో ఒక్కో రాష్ట్రానికి కేవలం 20 నిమిషాలు కేటాయించిన సీఈసీ.. ఈ సారి మాత్రం సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణకు సంబంధించి ఇప్పటికే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. పెండింగ్ లో ఉన్న 13 స్థానాలపై చర్చ సాగింది. ఏడు సీట్లకు అభ్యర్థుల ఎంపికపై కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మిగిలిన స్థానాలపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడంతో.. వాటిపై అధ్యక్షుడు ఖర్గేకి నిర్ణయాధికారం ఇచ్చారు.

తెలంగాణ నుంచి 6,7 స్థానాలు

బుధవారం లేదా గురువారం రిలీజ్ కానున్న లిస్ట్​లో తెలంగాణ లోని 6,7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉంది. మిగిలిని సెగ్మెంట్ పై సీఈసీలో ఏకాభిప్రాయం రాకపోవడంతో వాటిని పెండింగ్ లో పెట్టనున్నట్టు సమాచారం. 

ఈ సీట్లపై క్లారిటీ?

సీఈసీ భేటీలో తెలంగాణలోని పలు లోక్​సభ స్థానాలకు ఫైనల్ అయ్యాయంటూ ఏఐసీసీ వర్గాల్లో కొంతమంది నేతల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. నిజామాబాద్-జీవన్ రెడ్డి, పెద్దపల్లి-గడ్డం వంశీ, చేవెళ్ల- రంజిత్ రెడ్డి, ఆదిలాబాద్- డాక్టర్ సుమలత, కరీంనగర్ - ప్రవీణ్ రెడ్డి, సికింద్రాబాద్ - దానం నాగేందర్, వరంగల్ - పసునూరి దయాకర్, భువనగిరి - పైళ్ల శేఖర్ రెడ్డి, హైదరాబాద్ - షానవాజ్ కు దక్కవచ్చని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే మెదక్, ఖమ్మం, నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి నియోజకవర్గాలకు పోటీ ఎక్కువగా ఉంది. దీంతో ఈ స్థానాలను ప్రస్తుతానికి పక్కన పెట్టి నెక్స్ట్​ సీఈసీ భేటీలో అభ్యర్థులను నిర్ణయించనున్నట్లు తెలిసింది.