అవిశ్వాసం నెగ్గిన మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నికపై సస్పెన్స్​

అవిశ్వాసం నెగ్గిన మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నికపై సస్పెన్స్​
  • నెలరోజుల్లో ఎన్నికలు నిర్వహించాలనే సంప్రదాయం
  •     మున్సిపల్​ యాక్ట్​లో ‘గడువు’ ప్రస్తావన లేదంటున్న ఆఫీసర్లు 
  •     సర్కారు నోటిఫై చేస్తేనే రంగంలోకి ఈసీ
  •     పలుచోట్ల ఇన్​చార్జీలు లేక అయోమయం

యాదాద్రి, వెలుగు : ఇటీవల అవిశ్వాసాల కారణంగా చైర్మన్లు, వైస్​చైర్మన్లు గద్దె దిగిన మున్సిపాలిటీల్లో కొత్త చైర్మన్లు, వైస్​చైర్మన్ల ఎన్నికపై సస్పెన్స్​ నెలకొంది.  వైస్​చైర్మన్లు ఉన్న చోట్ల వాళ్లకు ఇన్​చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నప్పటికీ ఇద్దరూ లేని మున్సిపాలిటీల్లో అయోమయం నెలకొన్నది. నెలరోజుల్లో ఎన్నికలు నిర్వహించే సంప్రదాయం గతంలో ఉన్నప్పటికీ మున్సిపల్​యాక్ట్​లో టైం లిమిట్​ ఏదీ లేకపోవడం సమస్యగా మారింది. ఖాళీ అయిన మున్సిపాలిటీలను సర్కారు నోటిఫై చేసి ఎన్నికల కమిషన్​కు నివేదిస్తే, ఈసీ ఇచ్చే డేట్ల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్లు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున ప్రభుత్వం వేచిచూసే ధోరణి  అవలంబిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పెండింగ్​లోనే మున్సిపల్​యాక్ట్​2019..  

2020లో జరిగిన మున్సిపల్​ఎలక్షన్లలో బీఆర్ఎస్​కు అనేక చోట్ల పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు. ఇతర పార్టీల కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకొని ఎక్స్​ అఫిషియో ఓట్లతో చైర్మన్, వైస్​ చైర్మన్ పదవులను దక్కించుకుంది. అంతకు ముందే బీఆర్ఎస్​సర్కారు తెలంగాణ మున్సిపాలిటీ చట్టం- 2019ను రూపొందించి గవర్నర్​అమోదానికి పంపించింది. ఈ చట్టం ప్రకారం నాలుగేండ్ల వరకూ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టడానికి వీలులేదు. అయితే, కొత్త మున్సిపల్​యాక్ట్​ ఇప్పటికీ గవర్నర్​ తమిళ సై సౌందర్​రాజన్​ వద్ద  పెండింగ్​లోనే ఉంది. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​మున్సిపాలిటీ చట్టం1965 ప్రకారం 2023 జనవరితో చైర్మన్ల పదవీ కాలం మూడేండ్లు ముగియడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల్లో చైర్మన్లపై అవిశ్వాసాలు పెట్టారు. కానీ,  అప్పటి బీఆర్ఎస్​ప్రభుత్వం అవిశ్వాసంపై ముందుకు వెళ్లకుండా చూసుకున్నది. మరోవైపు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్​చైర్మన్​ఎరుకల సుధ సహా పలువురు చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.  

చైర్మన్​ఎన్నికపై అస్పష్టత 

తెలంగాణ మున్సిపల్​యాక్ట్​–2019లో చైర్మన్, వైస్​ చైర్మన్లపై అవిశ్వాసం నోటీసు ఇచ్చాక నెల రోజుల్లోనే ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఉంది. అయితే స్టే కారణంగా అవిశ్వాసం వాయిదా పడినా కూడా అవిశ్వాసంపై ముందుకు సాగొచ్చని గతేడాది అక్టోబర్​6న హైకోర్టు తీర్పు చెప్పింది. దీని ప్రకారం ఏపీ మున్సిపల్​యాక్ట్​1965 ఆధారంగా 2008లో జారీ చేసిన జీవో నంబర్​835 ప్రకారం అవిశ్వాసంపై ముందుకెళ్లడానికి అవకాశం వచ్చింది. అయితే, డిసెంబర్​లో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో అవిశ్వాసం అంశం వెనుకబడింది. బీఆర్ఎస్​ ఓడిపోయి కాంగ్రెస్​పవర్​లోకి రావడంతో అవిశ్వాసం అంశం మళ్లీ తెరపైకి రావడంతో దాదాపు ప్రతి జిల్లాలో ఎక్కడోచోట అవిశ్వాస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్​ చైర్మన్లు, వైస్​ చైర్మన్లు పదవులు కోల్పోతున్నారు. కానీ, చైర్మన్లు, వైస్​చైర్మన్లను ఎన్ని రోజుల్లో ఎన్నుకోవాలనే దానిపై పాత మున్సిపల్​యాక్టులో క్లారిటీ లేకపోవడంతో సర్కారు ఎప్పుడు స్పష్టత వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.  

ఖాళీలు నోటిఫై అయితేనే..

రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిణామాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. వీటిని ప్రభుత్వం పరిశీలించి ఏఏ మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్​చైర్మన్​లేదా రెండు పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని నోటిఫై చేయాల్సి ఉంటుంది. దాన్ని పరిశీలించిన తర్వాతే ఎన్నికల కమిషన్​ రంగంలోకి దిగుతుంది. అయితే ఈ ప్రక్రియ జరడానికి టైం లిమిట్​ అంటూ ఏదీ లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి నోటిఫై చేసినట్టు వస్తేనే ఎన్నికల కమిషన్​ చైర్మన్​, వైస్​చైర్మన్​ఎన్నిక కోసం తేదీ నిర్ణయిస్తుందంటున్నారు. సమావేశానికి 50 శాతం సభ్యులు హాజరైతే కోరం ఉన్నట్టుగా పరిగణించి ఎన్నికలు నిర్వహిస్తారని చెబుతున్నరు.

జనవరి 8న నల్గొండలో... 

నల్గొండ మున్సిపాలిటీలో జనవరి 8న అవిశ్వాస మీటింగ్​జరిగింది. బీఆర్ఎస్​అసమ్మతి కౌన్సిలర్ల తిరుగుబాటు కారణంగా అవిశ్వాస తీర్మానం పెట్టగా మున్సిపల్​చైర్మన్ మందడి సైదిరెడ్డి పదవి కోల్పోయారు. కొత్త చైర్మన్‌ ఎన్నికయ్యేంత వరకు ప్రస్తుత వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేశ్​చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 15 రోజలు గడిచినా ఇప్పటివరకూ చైర్మన్​స్థానం ఖాళీ అయినట్టుగా నోటిఫై చేయలేదు. 

మంచిర్యాల, భువనగిరిల్లో...

మంచిర్యాల మున్సిపల్​చైర్మన్ పెంట రాజయ్య, వైస్​ చైర్మన్​ గాజుల ముఖేశ్​పై​ అవిశ్వాసం ప్రకటించడంతో ఇద్దరూ రాజీనామాలు చేశారు. అయితే రాజీనామాలు ఆమోదించకపోవడంతో ముందుగా నిర్ణయించినట్టుగా జనవరి11న అవిశ్వాస తీర్మాన సమావేశం పెట్టారు. ఇందులో చైర్మన్​, వైస్​ చైర్మన్లు పదవులు కోల్పోయారు. దీంతో మంచిర్యాల మున్సిపాలిటీలో ఇన్​చార్జి తతతతతతతతతకూడా లేని పరిస్థితి నెలకొంది. యాదాద్రి జిల్లా భువనగిరిలోనూ ఇదే జరిగింది. ఇక్కడ మున్సిపల్​చైర్మన్​ఎనబోయిన ఆంజనేయులు, వైస్​ చైర్మన్​ చింతల కిష్టయ్యపై అవిశ్వాసం ప్రకటించగా వీరు కూడా పదవులకు రాజీనామాలు చేశారు. రిజిగ్నేషన్​ఆమోదించకపోవడంతో జనవరి 23న అవిశ్వాస తీర్మానం పెట్టగా నెగ్గింది. దీంతో చైర్మన్, వైస్​ చైర్మన్లు పదవులు కోల్పోవడంతో భువనగిరికి ఇన్​చార్జి కూడా లేకుండా పోయాడు.  

నేరేడుచర్లలో.. 

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్​చైర్మన్​చందమల్ల జయబాబుపై అవిశ్వాసం ప్రకటించగా, జనవరి 23న అవిశ్వాసం నెగ్గింది. దీంతో జయబాబు పదవి కోల్పోయారు. అంతకు ముందే వైస్​చైర్మన్​గా ఉన్న చల్లా శ్రీలత పదవికి రాజీనామా చేయడంతో నేరేడుచర్లకు ఇన్​చార్జి లేడు.

చైర్మన్​, వైస్​ చైర్మన్ల ఎన్నికపై గడువు లేదు

అవిశ్వాసం నెగ్గిన కారణంగా చైర్మన్లు, వైస్​ చైర్మన్లు పదవులు కోల్పోయారు. అవిశ్వాసం జరిగిన తేదీ నుంచి ఇన్ని రోజుల్లోనే చైర్మన్​ ఎన్నిక జరపాలని రూల్​ఏమీ లేదు. చైర్మన్​, వైస్​ చైర్మన్ల పదవులు ఖాళీ అయినట్టు నోటిఫై చేసిన తర్వాతే ఎన్నికల కమిషన్​ తేదీలు నిర్ణయిస్తుంది.  
-
 జీ వీరారెడ్డి, అడిషనల్​ కలెక్టర్,​ యాదాద్రి