గండ్ర Vs సిరికొండ : వరంగల్ భూపాలపల్లి బీఆర్ఎస్ టికెట్ పై సస్పెన్స్

గండ్ర Vs సిరికొండ : వరంగల్ భూపాలపల్లి బీఆర్ఎస్ టికెట్ పై సస్పెన్స్
  •     ఆరు నెలల కింద వెంకటరమణారెడ్డికి ‌‌కన్ఫర్మ్‌‌ చేసిన కేటీఆర్‌‌
  •     మధుసూదనాచారి కోసం పట్టుపడుతున్న ఉద్యమకారులు
  •     సిరికొండకు మద్దతుగా అనుచరుల ఆందోళన
  •     బీఆర్​ఎస్ ​క్యాడర్​లో గందరగోళం

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : ‘భూపాలపల్లి సిట్టింగ్‌‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి వచ్చే ఎన్నికల్లోనూ టికెట్‌‌ ఇస్తాం, సీనియర్‌‌ లీడర్‌‌ సిరికొండ మధుసూదనాచారి సేవలను శాసనమండలిలో ఉపయోగించుకుంటాం’ అని ఫిబ్రవరి 23న మంత్రి కేటీఆర్‌‌ భూపాలపల్లిలో స్వయంగా ప్రకటించారు. అయినా నియోజకవర్గంలో టికెట్‌‌ లొల్లి ఆగడం లేదు. మధుసూదనాచారికి అసెంబ్లీ టికెట్‌‌ ఇవ్వాల్సిందేనని ఆయన వర్గీయులు పట్టుబట్టారు. ఒక వేళ గండ్రకు టికెట్‌‌ ఇస్తే 150 మందిమి నామినేషన్‌‌ వేస్తామని, గండ్రను ఓడించి తీరుతామని స్పష్టం చేశారు.

ఆదివారం ఏకంగా సిరికొండ వర్గంలోని ముగ్గురు లీడర్లు సెల్‌‌ టవర్‌‌ ఎక్కి నిరసన తెలుపగా, పలువురు లీడర్లు రాస్తారోకోకు దిగారు. దీంతో భూపాలపల్లి బీఆర్‌‌ఎస్‌‌ టికెట్‌‌ కేటాయింపు హైకమాండ్‌‌కు తలనొప్పిగా మారింది. నేడు బీఆర్‌‌ఎస్‌‌ క్యాండిడేట్ల లిస్ట్‌‌ విడుదల కానుండడం, నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయుల ఆందోళన జరుగుతుండడంతో అసలు టికెట్‌‌ ఎవరికి దక్కుందన్న చర్చ జోరుగా సాగుతోంది. 

రెండు రోజులుగా హైదరాబాద్‌‌లోనే గండ్ర

2018లో కాంగ్రెస్‌‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి ఆ తర్వాత బీఆర్‌‌ఎస్‌‌లో చేరారు. ఆయన భార్య జ్యోతి బీఆర్‌‌ఎస్‌‌ నుంచి శాయంపేట జడ్పీటీసీగా గెలిచి వరంగల్‌‌ జడ్పీ చైర్మన్‌‌ అయ్యారు. తర్వాత ఆమెకు బీఆర్‌‌‌‌ఎస్‌‌ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో గండ్రకే టికెట్‌‌ కన్ఫర్మ్‌‌ చేస్తున్నట్లు కేటీఆర్‌‌ ప్రకటించడంతో వెంకటరమణారెడ్డి ‘మన ఊరు మన రమణన్న’ పేరుతో గ్రామాల్లో పర్యటిస్తూ పల్లె నిద్ర చేస్తూ, సీడీఎఫ్‌‌‌‌ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.

ఇప్పుడు టికెట్‌‌ విషయంలో సిరికొండ వర్గం లొల్లి స్టార్ట్‌‌ చేయడంతో గండ్ర వర్గం ఆందోళనకు గురవుతోంది. దీంతో గండ్ర 2 రోజులుగా హైదరాబాద్‌‌‌‌లోనే మకాం వేసి భూపాలపల్లిలో జరుగుతున్న విషయాలపై హైకమాండ్‌‌తో చర్చిస్తున్నారు.

వెనక్కి తగ్గని సిరికొండ వర్గం

ఎమ్మెల్యే టికెట్‌‌ ‌‌గండ్రకే కేటాయించినట్లు కేటీఆర్‌‌ ప్రకటించినప్పటికీ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి వర్గం వెనక్కి తగ్గడం లేదు. గండ్రకే టికెట్‌‌ కన్ఫర్మ్‌‌ అయినట్లు లీకులు అందడంతో సిరికొండ వర్గీయులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌‌ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్‌‌ ఇవ్వొద్దని హైకమాండ్‌‌ను కోరారు. తమ మాట వినకుండా గండ్రకే టికెట్‌‌ ఇస్తే 150 మందిమి నామినేషన్‌‌ వేస్తామని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌‌‌‌లో ప్రత్యేకంగా సమావేశమై ఇదే విషయాన్ని హైకమాండ్‌‌కు వివరించారు. ఆదివారం ముగ్గురు లీడర్లు సెల్‌‌ టవర్‌‌ ఎక్కడంతో బీఆర్‌‌ఎస్‌‌ క్యాడర్‌‌ గందరగోళంలో పడింది.

గతంలో పదవి కోసం.. ఇప్పుడు టికెట్‌‌ కోసం

భూపాలపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మధ్య 15 ఏళ్ల నుంచి వైరం కొనసాగుతూనే ఉంది. 2009లో భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరుగగా, ప్రతీసారి వీరిద్దరే పోటీ పడ్డారు. కాంగ్రెస్‌‌ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి సిరికొండ మధుసూదనాచారి బరిలో నిలిచారు.

2009, 2018లో గండ్ర, 2014లో సిరికొండ ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే గండ్ర కాంగ్రెస్‌‌‌‌ నుంచి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరడంతో సిరికొండ ఎమ్మెల్యే టికెట్‌‌ సందిగ్ధంలో పడింది. వీరిద్దరు వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులుగా కాకుండా ఒకే పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్‌‌‌‌ కోసం పోటీ పడుతున్నారు. టికెట్‌‌ దక్కించుకునేందుకు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు.