భూంపల్లి ఎస్సైపై సస్పెన్షన్‌‌ వేటు

భూంపల్లి ఎస్సైపై సస్పెన్షన్‌‌ వేటు

దుబ్బాక, వెలుగు : కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడడంతో పాటు నిందితులకే సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలపై సిద్దిపేట జిల్లా భూంపల్లి ఎస్సై రవికాంత్‌‌పై సస్పెన్షన్‌‌ వేటు పడింది. రవికాంత్‌‌ మెదక్‌‌ జిల్లా శివంపేట ఎస్సైగా పనిచేసే టైంలో ఓ మామిడి తోటలో 50 టన్నులకు పైగా మామిడి పండ్లు చోరీకి గురయ్యాయి. దీంతో తోట యజమానురాలు విమలారెడ్డి ఫిర్యాదు చేసినా ఎస్సై నిర్లక్ష్యంగా వ్యవహరించి కేసు నమోదు చేయలేదు.

పైగా ఆ కేసు సివిల్‌‌ పరిధిలోకి వస్తుందంటూ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించాడు. అలాగే భూ తగాదా కేసుల్లో బాధితులకు కాకుండా నిందితులకు సహకరిస్తున్నారని ఎస్సైపై ఆరోపణలు వచ్చాయి. ఎస్పీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్‌‌ను ఉన్నతాధికారులకు అందజేశారు. ఆరోపణలు నిజమేనని తేలడంతో ఎస్సై రవికాంత్‌‌ను సస్పెండ్‌‌ చేస్తూ మల్టీజోన్‌‌ 1 ఐజీ రంగనాథ్‌‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.