- రెవెన్యూ ఇన్స్పెక్టర్, రికార్డ్ అసిస్టెంట్‌పై కూడా..
- తహసీల్దార్ ఆఫీసును ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్
- విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలుంటాయని హెచ్చరిక
హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యం వహించిన మారేడుపల్లి తహసీల్దార్ పద్మాసుందరి, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ప్రసన్నలక్ష్మి, రికార్డ్ అసిస్టెంట్రవిని హైదరాబాద్కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సస్పెండ్ చేశారు. ఉద్యోగులు బాధ్యతగా, జవాబుదారీతనంతో పని చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం ఆయన మారేడుపల్లి తహసీల్దార్ ఆఫీసును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రికార్డులను, సిబ్బంది అటెండెన్స్రిజిస్టర్లను పరిశీలించారు. ఆఫీసులో లేని సిబ్బంది ఎక్కడికి వెళ్లారని ఆరా తీశారు. ఇన్ వార్డు రిజిస్టర్‌ను పరిశీలించి ప్రతి అప్లికేషన్ పై డేట్ స్టాంప్ వేసి సంబంధిత సెక్షన్‌కు అందజేయాలని ఆదేశించారు. దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని చెప్పారు. రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. విధులకు సక్రమంగా హాజరుకాని, రికార్డులు సరిగ్గా మెయింటెన్చేయని ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట సికింద్రాబాద్ ఆర్డీఓ దశరథ్ సింగ్ తదితరులు ఉన్నారు.
‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనుల్లో వేగం పెరగాలి
అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో వేగం పెరగాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. లేబర్సంఖ్యను పెంచి, పనులను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు పనులను పరిశీలించాలని, క్వాలిటీగా లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అసిస్టెంట్ ఇంజనీర్లు పనులను పర్యవేక్షించాలని తెలిపారు. పూర్తయిన పనుల బిల్లులను సమర్పించాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి ఆర్.రోహిణి, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
