
ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించిన 26 మంది బీజేవైఎం కార్యకర్తలపై బంజారాహిల్స్ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. మూడుసార్లు సెక్షన్లను పోలీసులు మార్చారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న రాత్రి నుండి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న సాయంత్రం 341, 148, 353, 509, 149 కింద కేసులు నమోదు చేశారు. రాత్రి వైద్య పరీక్షలు కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో ఐపీసీ 307(హత్యాయత్నం) సెక్షన్ యాడ్ చేశారు. ఈరోజు ఉదయం మూడో సారి సెక్షన్లను మార్చి 307 (హత్యాయత్నం)ను పోలీసులు తొలగించారు. చివరిగా 341, 147, 148, 353 332, 509, రెడ్ విత్ 149 కింద కేసులు నమోదు చేశారు.
రాజకీయ ఒత్తిళ్లు వల్ల ఇప్పటికే మూడు సార్లు సెక్షన్ల మార్చారని బీజేపీ కార్యకర్తలు వెల్లడించారు. మరోవైపు 26 మంది బీజేవైఎం కార్యకర్తల రిమాండ్ కి తరలింపుపై సస్పెన్షన్ కొనసాగుతోంది. లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడంతో.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలంటూ సోమవారం బీజేవైఎం నేతలు కవిత ఇంటిదగ్గర ఆందోళన చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు బలవంతంగా కార్యకర్తలను అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కవితను పరామర్శించడానికి టీఆర్ఎస్ నేతలు వస్తున్నారు. కవితను కలిసిన వారిలో మంత్రితో పాటు పలువురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు.