ఓఆర్ఆర్ పై కారులో .. మహిళా డాక్టర్ అనుమానాస్పద మృతి

 ఓఆర్ఆర్ పై కారులో ..  మహిళా డాక్టర్ అనుమానాస్పద మృతి
  •     ఓఆర్ఆర్ పై కారులో అపస్మారక స్థితిలోకి
  •     హాస్పిటల్​లో చికిత్స  పొందుతూ మృతి 
  •     ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేస్కున్నట్లు అనుమానాలు

రామచంద్రాపురం, వెలుగు :  ఔటర్ రింగ్ రోడ్డుపై తన కారులో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఒక మహిళా డాక్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.  సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని హెచ్ఐజీ కాలనీలో నివసిస్తున్న ప్రకాశ్ రెడ్డి కూతురు రచనా రెడ్డి(26) ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో మెడిసిన్ పీజీ పూర్తి చేసింది. ఇటీవల బాచుపల్లిలోని మమత మెడికల్ కాలేజీలో ఇంటర్న్​షిప్​లో జాయిన్ అయ్యింది. సోమవారం ఉదయం హాస్పిటల్​కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి తన కారులో బయలుదేరింది. ముత్తంగి వద్ద ఆమె కారు రింగ్ రోడ్డుపైకి ఎక్కింది. కిష్టారెడ్డిపేట–సుల్తాన్​పూర్ పరిధిలో ఆమె కారు రోడ్డు పక్కన రెయిలింగ్​కు తాకి ఆగిపోయి ఉంది. 

అక్కడే ఉన్న కొంతమంది కారు దగ్గరకు వెళ్లి చూశారు. కారులో రచన అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి 100కు డయల్ చేసి , పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని రచనను మమత హాస్పిటల్​కు తరలించారు. సాయంత్రం 5 గంటలకు ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పటాన్​చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రచనా రెడ్డి చేతికి ఇంజక్షన్ తీసుకున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని, తానే స్వయంగా కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇంజక్షన్​ తీసుకొని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, రచనకు గత నవంబర్​లో తనకు నచ్చిన వ్యక్తితోనే ఎంగేజ్​మెంట్ జరిగిందని, వచ్చే మార్చిలో పెండ్లి జరగాల్సి ఉందని తెలిపారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.