పర్యావరణం కాపాడుతూ అభివృద్ధి చేయాలి : ఇందర్ పాల్ సింగ్

 పర్యావరణం కాపాడుతూ అభివృద్ధి చేయాలి : ఇందర్ పాల్ సింగ్
  • కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఎక్స్‌‌‌‌పర్ట్ అప్రైజల్ కమిటీ చైర్మన్ ఇందర్ పాల్ సింగ్

హైదరాబాద్, వెలుగు: పర్యావరణం, అభివృద్ధి కలిసి నడిచినప్పుడే సుస్థిర కోల్ మైనింగ్, ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఎక్స్‌‌‌‌పర్ట్ అప్రైజల్ కమిటీ చైర్మన్ ఇందర్ పాల్ సింగ్ మాథారు అన్నారు. అభివృద్ధి కోసం పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం ఇకపై కుదరదన్నారు. సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించిన ‘కోల్ మైనింగ్, పర్యావరణ సుస్థిరత’అనే అంశంపై జరిగిన జాతీయ స్థాయి వర్క్ షాప్‌‌‌‌లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. 

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నాయని, ఈ విషయంలో మనం కొంత వెనుకబడి ఉన్నామని తెలిపారు. పర్యావరణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మైనింగ్ నిర్వహించటం ఎలా? అనే అంశంపైనా ఈ వర్క్ షాప్‌‌‌‌లో మేధావులు ఇచ్చే సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. 

సింగరేణిలో పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాం: సీఎండీ బలరామ్​

సింగరేణి సంస్థ మొదటి నుంచి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ దిశా నిర్దేశంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటూ మైనింగ్ కార్యక్రమాలు చేపడుతోందని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. తాము పర్యావరణ హితంగా ఓవర్ బర్డెన్ నుంచి ఇసుక తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేశామని, వాతావరణ కాలుష్యం జరగకుండా మిస్ట్ స్ప్రేయింగ్, డ్రై ఫాగ్ డస్ట్ సప్రెషన్ పద్ధతులు అవలంబిస్తున్నామని వివరించారు. 

సదస్సులో దేశవ్యాప్తంగా పలు బొగ్గు కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు, పర్యావరణ శాస్త్రవేత్తలు లలిత్ కపూర్, డాక్టర్ ఉమేశ్ జగన్నాథరావు కహలేకర్, డాక్టర్ సంతోష్ కుమార్ హంపన్నవార్, ఎస్.చంద్రశేఖర్, కె.బి.బిశ్వాస్, ప్రొఫెసర్ శ్యామ్ శంకర్ సింగ్, డాక్టర్ వినోద్ అగర్వాల్, మహిపాల్ సింగ్, డాక్టర్ రాజేశ్ ప్రసాద్ రస్తోగి, తరుణ్ కత్తుల, ఎన్.జ్యోతి కుమార్, కె.లక్ష్మా పాల్గొన్నారు.