దిందాలో పోడు లొల్లి..ట్రెంచ్ పనుల కోసం వెళ్లిన ఫారెస్ట్ అధికారులు

దిందాలో పోడు లొల్లి..ట్రెంచ్ పనుల కోసం వెళ్లిన ఫారెస్ట్ అధికారులు
  • అడ్డుకున్న పోడు రైతులు.. పలువురు అరెస్ట్​

కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్​జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో పోడు భూముల లొల్లి మళ్లీ షురూ అయింది. అటవీశాఖ అధికారులు రీట్రైవ్ చేసిన పోడు భూముల్లో మంగళవారం మొక్కలు నాటేందుకు, ట్రెంచ్ పనుల కోసం ట్రాక్టర్లతో వెళ్లారు. అధికారులను స్థానిక రైతులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారి మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దిందా గ్రామంలో కొంతకాలంగా పోడు భూముల అంశంపై అటవీ శాఖ అధికారులు, స్థానిక రైతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

ఆక్రమణలకు గురవుతున్న అటవీ భూములను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అటవీ శాఖ అధికారులు చెబుతుండగా.. తాతల కాలం నుంచి ఆ భూములను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని రైతులు చెబుతున్నారు. మంగళవారం ట్రెంచ్​వేసేందుకు అధికారులు ట్రాక్టర్లతో పోడు భూముల్లోకి వెళ్లగా కొందరు గ్రామస్తులు వాహనాలకు అడ్డంగా పడుకొని ఆందోళన చేశారు. రైతులు, గ్రామస్తులను  అధికారులు అదుపులోకి తీసుకొని కాగజ్‌‌నగర్‌‌ ఫారెస్ట్ డివిజన్ కార్యాలయానికి తరలించారు.

ఈ విషయంపై కాగజ్‌‌నగర్ ఎఫ్‌‌డీవో అప్పయ్య మాట్లాడుతూ.. చింతలమనేపల్లి మండలం కర్జెల్లీ రేంజ్ పరిధిలో సుమారు 31 శాతం అటవీ భూమి ఆక్రమణకు గురైందని, ఒక్కో కుటుంబానికి నాలుగెకరాల చొప్పున పోడు సాగు చేసుకునే అవకాశం కల్పించినప్పటికీ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారని తెలిపారు.