ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో బోసుబాబు నిడుమోలు నిర్మించిన చిత్రం ‘సుయోధన’. సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం సినిమా విడుదలవుతోంది. గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ ‘ఈ కథ, టైటిల్ విన్నప్పుడే కొత్తగా ఉంటుందనే నమ్మకం కలిగింది. ప్రేక్షకుల ఊహకు అందనంత ఆసక్తికరంగా సాగే చిత్రమిది. ఈ ప్రాజెక్టుతో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా’ అని అన్నాడు. సుమిత పాత్రలో మెప్పిస్తానని హీరోయిన్ ద్రిషిక చందర్ చెప్పింది. నటుడు సాయికుమార్ మాట్లాడుతూ ‘నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించే చిత్రమిది. నాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ నాటికలో ధుర్యోధనుడి పాత్రను అభినయించాను. మళ్లీ ఇప్పుడు అదే పాత్రలో నటిస్తుంటే ఆ రోజులు గుర్తుకొచ్చాయి’ అని అన్నారు. దర్శకుడు సుకుమార్‌కు ఏకలవ్య శిష్యుడిగా, ఆయన తీసిన ‘1 నేనొక్కడినే’ స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నానని చిత్ర దర్శకుడు మాధవ్ రెడ్డి చెప్పాడు. శ్రీరామ నవమికి రాబోతున్న తమ చిత్రాన్ని ఆదరించాలని నిర్మాత బోసుబాబు ప్రేక్షకులను కోరారు. నటులు దేవిప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ పాల్గొన్నారు.
