
న్యూఢిల్లీ: విద్యార్థినులపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, స్వామి చైతన్యానంద అరెస్ట్ అయ్యారు. శనివారం (సెప్టెంబర్ 27) రాత్రి ఆగ్రాలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆగ్రా నుంచి ఢిల్లీకి తరలించారు పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో హాజరు పర్చనున్నారు. ఈ కేసులో మరిన్నీ విషయాలు రాబట్టేందుకు స్వామి చైతన్యానందను పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌కు చెందిన 17 మంది విద్యార్థినులు స్వామి చైతన్యానంద తమను లైంగిక వేధింపులకు గురి చేశాడని 2025, సెప్టెంబర్ 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు వసంత్ కుంజ్ పోలీసులు స్వామి చైతన్యానందపై కేసు నమోదు చేశారు.
కేసు నమోదు అయినప్పటి నుంచి స్వామి చైతన్యానంద పరారీలో ఉన్నారు. పోలీసులు కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఆగ్రాలోని హోటల్ ఫస్ట్ తాజ్గంజ్లో చైతన్యానంద ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 2025, సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి హోటల్లో ఆయనను అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించారు.