స్వామి రామానంద తీర్థ స్వాతంత్ర్య సమరయోధుడిగా, హైదరాబాద్ సంస్థాన విమోచనానికి నేతృత్వం వహించిన మహా నాయకుడిగా, పార్లమెంటేరియన్‌గా ప్రఖ్యాతి పొందారు. సన్యాసిగా, కార్మిక ఉద్యమకారుడిగా, విద్యావేత్తగా భారత చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. వ్యక్తిగత జీవితాన్ని త్యాగంతో మలుచుకొని, ప్రజాసేవనే పరమావధిగా భావించిన ధీరోధాత్తుడు ఆయన.
స్వామీజీ అసలు పేరు వెంకటరావు ఖేడ్గీకర్. తండ్రి భాపూరావు, తల్లి యసుబాయి. 1903 అక్టోబర్ 3న అప్పటి హైదరాబాద్ సంస్థానంలోని గుల్బర్గా జిల్లా, ఝవర్గీ తాలూకా సింద్గీ గ్రామంలో జన్మించారు. లోకమాన్య బాలగంగాధర తిలక్ ఆయనకు ఆదర్శం. 1920 జులై 31న తిలక్ పరమపదించిన వార్త విన్న క్షణం నుంచి బ్రహ్మచారిగా జీవిస్తూ జీవితాంతం మాతృభూమి సేవకే అంకితం అవుతానని ప్రతిజ్ఞ చేశారు.
జాతీయోద్యమ ప్రభావం – గాంధేయ మార్గం
గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని గాంధీ టోపీ ధరించి పాఠశాలకు వెళ్లడం ద్వారా నిరసన వ్యక్తం చేశారు. కొంతకాలం చదువుకు విరామమిచ్చినా, పూనాలోని తిలక్ విద్యాపీఠ్‌లో మూడేళ్లు అధ్యయనం చేసి ‘ప్రజాస్వామ్యం – దాని క్రమవికాసం’ అంశంపై సిద్ధాంత వ్యాసంతో పూనా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ పట్టా పొందారు. ప్రసిద్ధ కార్మిక నాయకుడు ఎన్.ఎం. జోషి నాయకత్వంలోని కార్మికోద్యమంలో పనిచేశారు. ఒస్మానాబాద్‌లో ప్రధానోపాధ్యాయుడిగా చేరారు. హైదరాబాద్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న ఆంక్షలను గమనించి, ఉన్నత పాఠశాల స్థాపనకు ప్రభుత్వ నిరాకరణను సృజనాత్మకంగా ఎదుర్కొని, ప్రాథమిక పాఠశాల విస్తరణ ద్వారా ఉన్నత పాఠశాలను నెలకొల్పారు.
సన్యాస దీక్ష – రాజకీయ ప్రవేశం
1932లో ఉస్మానాబాద్ జిల్లాలో స్వామి నారాయణ ద్వారా ‘విద్వత్ సన్యాసం’ స్వీకరించి ‘స్వామి రామానంద తీర్థ’గా ప్రసిద్ధులయ్యారు. 1938లో రాజకీయ రంగంలోకి ప్రవేశించి మహారాష్ట్ర పరిషత్ కార్యదర్శిగా పనిచేశారు. అదే సంవత్సరంలో హైదరాబాద్‌కు తన నివాసాన్ని మార్చుకున్నారు. నిజాం పాలనలో పాలనా సంస్కరణలను మతపరమైన కోణంలో అణచివేయడాన్ని ఎదుర్కొనేందుకు, మతరహిత రాజకీయ వేదికగా ‘హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్’ అవసరాన్ని తొలిసారిగా గుర్తించినవారు రామానంద తీర్థ. ఆయనే ఆ సంస్థ స్థాపనకు ప్రధాన ప్రేరణ. 1938 సెప్టెంబర్‌లో ఏర్పాటు చేయదలచిన మహాసభకు ముందే సెప్టెంబర్ 8న నిజాం ప్రభుత్వం సంస్థను నిషేధించింది. ఆవిర్భావానికి ముందే నిషేధానికి గురైన అరుదైన రాజకీయ సంస్థగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ చరిత్రలో నిలిచింది.
సత్యాగ్రహం – జైలు జీవితం
1938లో నిషేధాన్ని అహింసాయుత సత్యాగ్రహం ద్వారా ప్రారంభించారు . రామానంద తీర్థను 1938 అక్టోబర్ 27న అరెస్ట్ చేసి 18 నెలలు కఠిన శిక్ష విధించారు. 1940లో వ్యక్తిగత సత్యాగ్రహానికి దిగడంతో మళ్లీ అరెస్ట్ అయి నిజామాబాద్ జైలులో నిర్బంధం ఎదుర్కొన్నారు. 1942–1950 మధ్య హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు. 1942 బొంబాయి కాంగ్రెస్ సభలో క్విట్ ఇండియా తీర్మానం ఆమోదమైన తర్వాత అరెస్ట్ అయి 1943 డిసెంబరులో విడుదలయ్యారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావాలని ఉద్యమం నడిపినందుకు 1948లో మళ్లీ జైలు జీవితం అనుభవించారు.
భూదాన్ ఉద్యమానికి మద్దతు
నాందేడ్ పీపుల్స్ కాలేజి వ్యవస్థాపకుడు, హైదరాబాద్ ఖాదీ సమితి స్థాపక అధ్యక్షుడు, హిందీ ప్రచార సంఘం అధ్యక్షుడు, 1952లో హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, 1952–1962 మధ్య లోక్‌సభ సభ్యుడిగా ఇలా ఆయన సేవలు విస్తృతమైనవి. హైదరాబాద్‌లోనే నివసిస్తూ ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా కొనసాగారు. ఉస్మానియా సెనేట్ సభ్యుడిగా, వినోభాభావే భూదాన్ ఉద్యమానికి మద్దతుదారుగా పనిచేశారు. 1972 జనవరి 22న హైదరాబాద్‌లో పరమపదించారు. త్యాగం, ధైర్యం, సిద్ధాంత నిబద్ధత, ప్రజాసేవ. ఈ నాలుగు స్తంభాలపై నిలిచిన వ్యక్తిత్వమే స్వామి రామానంద తీర్థ. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం.
- రామకిష్టయ్య సంగనభట్ల
