యాదిలో.. నరేంద్రుని గుణాలు వివేకం.. ఆనందం..

యాదిలో.. నరేంద్రుని గుణాలు వివేకం.. ఆనందం..

స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్.1862 జనవరి 9న కలకత్తాలో జన్మించాడు. అక్కడే క్రిస్టియన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్​ అయ్యాడు. నరేంద్రకు బాక్సింగ్, స్విమ్మింగ్, రోయింగ్ బాగా వచ్చు. గుర్రాలంటే చాలా ఇష్టం. అప్పట్లో ఫ్యాషనబుల్​గా ఉండేవాడు. యువకులకు ఆయన సెలబ్రెటీలాగ. మ్యూజిక్​ అంటే మహా ఇష్టం. బెంగాలీ పాటలు పాడేవాడు.18 ఏండ్ల ప్రాయంలో తోటి స్నేహితులతో కలిసి ఒక ఫ్రెండ్ ఇంట్లో రామకృష్ణ పరమహంసను కలిశాడు. ఆ తర్వాత ఆయనను ఎన్నో ప్రశ్నలు అడిగి తన సందేహాలను తీర్చుకున్నాడు. 

రామకృష్ణ తదనంతరం ఆయన శిష్యులంతా కలిసి సన్యాసి వర్గంగా ఏర్పడ్డారు. ఆ వర్గానికి నేతగా నరేంద్రుడిని ఎంచుకుని ‘వివేకానందుడు’ అని పేరు పెట్టారు. అంటే వివేకం, ఆనందం ప్రత్యేక గుణాలు గలవాడని అర్థం. ఆ తర్వాత ఆరు సంవత్సరాలు ఆయన సన్యాసిగా తిరిగాడు. 1893లో మద్రాస్​కు, భారతదేశం తరఫున సర్వమత సమ్మేళనానికి బొంబాయి నుంచి అమెరికా వెళ్లాడు. 1895 వరకు అక్కడే ఉండి శిష్యులను తయారుచేసుకోగలిగాడు. 

అమెరికాలో ఉన్నప్పుడే స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్​లకు అనేకసార్లు యాత్రలు చేశాడు.స్వదేశం వచ్చాక తన ప్రజలను పేదరికం, అవమానకర స్థితి నుంచి పైకి తీసుకురావడానికి అవసరమైన పెద్ద మొత్తంలో డబ్బును పోగుచేయడానికి పశ్చిమానికి వెళ్లాడు. కానీ, పూర్తిగా సఫలం కాలేకపోయాడు. దాంతో స్వదేశీయులలోనే సాయపడే తత్త్వాన్ని, పేదల పట్ల కనికరాన్ని రేకెత్తించేందుకు పూనుకున్నాడు. కొన్ని నెలల తర్వాత ‘రామకృష్ణ మిషన్’ ఏర్పడింది. కానీ, ప్రజలు ఆయన్ను అంత త్వరగా అంగీకరించలేదు. ఆ తర్వాత కలకత్తా దగ్గర బేలూరు, హిమాలయాల్లోని అల్మోరాకు దగ్గరున్న మాయావతిలో మఠాలు తెరిచాడు. 

మానవజాతికి ఉపకారం చేయడం, వేదాంత సూత్రాల గురించి యూత్​కు ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్​ను ఆ మిషన్​ సభ్యులకు అప్పగించాడు. కొంతకాలానికి ఆయన  ఆరోగ్యం క్షీణించడంతో విశ్రాంతి, వాతావరణ మార్పు కోసం 1899లో పశ్చిమ దేశాలకు 2వ యాత్ర మొదలుపెట్టాడు. కాలిఫోర్నియా వెదర్​ ఆయనకు బాగా పడడంతో కాస్త కోలుకున్నాడు. తిరిగి ఇండియా వచ్చిన ఆయనకు డయాబెటిస్ మరింత బాధపెట్టసాగింది. అయినా ఆయన మిషన్​ పనిలో మునిగిపోయాడు. 40 ఏండ్లు జీవించిన ఆయన1902 జులై 4న మహా సమాధి చెందాడు.