
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశింపల్లి గ్రామానికి చెందిన ఆకునూరి అయిలయ్య, సులోచన దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వీరిలో నరేశ్ అందరికంటే చిన్నవాడు. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో డైలీ స్వీపర్‌గా సులోచన పనిచేస్తుండగా.. అయిలయ్య కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆకునూరి నరేశ్.. పదో తరగతి వరకు నర్సంపేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంటర్మీడియట్ హైదరాబాద్ సోషల్ వెల్ఫర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో, మద్రాస్ కాలేజీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివాడు. తర్వాత సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. 2020 ఆగస్టు 4న విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 782 ర్యాంకు సాధించి ఇండియన్ రైల్వేస్ పర్సనల్ సర్వీస్‌లో ఉద్యోగం సాధించి శిక్షణలో ఉన్నారు. అయితే ఎలాగైనా ఐఏఎస్ కావాలనే పట్టుదలతో ఉన్న నరేశ్.. మరోసారి సివిల్స్ రాశారు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో 117వ ర్యాంకు సాధించాడు. నరేశ్ అన్న సురేశ్ 2018లో గ్రూప్‒2 అధికారిగా సెలెక్ట్ అయ్యారు. వరంగల్‌లో అసిస్టెంట్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. తన అన్నను ఆదర్శంగా తీసుకొని సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు.