
లండన్: పోలాండ్ స్టార్ ప్లేయర్ ఇగా స్వైటెక్.. తొలిసారి వింబుల్డన్ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. బుధవారం (జులై 09) జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఎనిమిదో సీడ్ స్వైటెక్ 6–2, 7–5తో లుడ్మిలా సమ్సనోవా (రష్యా)పై గెలిచింది. కెరీర్‌లో ఐదుసార్లు స్లామ్ చాంపియన్‌గా నిలిచినా.. ఆల్ ఇంగ్లండ్ క్లబ్ గ్రాస్ కోర్టులపై మాత్రం స్వైటెక్ తడబడుతూనే ఉంది.
2018లో జూనియర్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత మళ్లీ టైటిల్ నెగ్గలేదు. ఇప్పటి వరకు వింబుల్డన్‌లో ఐదుసార్లు బరిలోకి దిగినా ఒక్కసారి మాత్రమే క్వార్టర్స్‌కు చేరింది. ఇప్పుడు ఆ అడ్డంకిని అధిగమించి టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. గంటా 49 నిమిషాల మ్యాచ్‌లో 3 ఏస్‌లు, 3 డబుల్ ఫాల్ట్స్ చేసింది. తన సర్వ్‌లో 70 శాతం పాయింట్లతో ఆధిపత్యం చూపెట్టింది.
ఐదు బ్రేక్ పాయింట్లను కాపాడుకోవడంతో పాటు 21 విన్నర్లతో మ్యాచ్‌ను ముగించింది. 5 డబుల్ ఫాల్ట్స్, 38 అనవసర చేసిన సమ్సనోవా బ్రేక్ పాయింట్లను కాపాడుకోవడంలో ఫెయిలైంది. మరో మ్యాచ్‌లో బెలిందా బెన్సిచ్(స్విట్జర్లాండ్) 7–6 (7/3), 7–6 (7/2)తో మిరా అండ్రీవా (రష్యా)పై నెగ్గి స్వైటెక్‌తో పోరుకు రెడీ అయ్యింది. రెండు గంటలా 8 నిమిషాల మ్యాచ్‌లో నెట్ పాయింట్స్ గెలవడం బెన్సిచ్‌కు కలిసొచ్చింది. ఆండ్రీవా (35) కంటే తక్కువ విన్నర్లు (20) కొట్టినా 24 తప్పిదాలకేపరిమితమైంది.
ఆండ్రీవా 37 అనవసర తప్పిదాలు చేసింది. చెరో నాలుగు బ్రేక్ పాయింట్లు లభించినా ఒక్కో దాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకున్నారు. మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ యానిక్ సినర్ (ఇటలీ) 7–6 (7/2), 6–4, 6–4తో బెన్ షెల్టన్ (అమెరికా)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించాడు. బలమైన సర్వీస్‌లు, బేస్ లైన్ గేమ్‌తో రెండు గంటలా 19 నిమిషాల్లోనే ప్రత్యర్థికి చెక్ పెట్టాడు.
మ్యాచ్ మొత్తంలో షెల్టన్ 14 ఏస్‌లు సంధించినా ప్రయోజనం దక్కలేదు. ఇక బ్రేక్ పాయింట్లు సాధించడంలోనూ విఫలమయ్యాడు. సినర్ ఏడుకే పరిమితమైనా, ఐదు బ్రేక్ పాయింట్లలో రెండింటిని కాచుకున్నాడు. 33 విన్నర్లు, 17 అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను ముగించాడు. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6–7 (6/8), 6–2, 7–5, 6–4తో 22వ సీడ్ ఫ్లావియో కొబొలి (ఇటలీ)ని ఓడించాడు.