
- గంటల్లోనే చెక్కులు క్లియర్ అమల్లోకి కొత్త సిస్టమ్
న్యూఢిల్లీ: ఇక నుంచి చెక్‌ల క్లియరెన్స్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. కొన్ని గంటల్లోనే పని పూర్తవుతుంది. బ్యాంకులు శనివారం నుంచి దేశవ్యాప్తంగా కొత్త చెక్ క్లియరెన్స్ సిస్టమ్‌ను అమలు చేయనున్నాయి. ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన ‘కంటిన్యూస్ క్లియరింగ్ అండ్ సెటిలిమెంట్ ఇన్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్’ ద్వారా చెక్ క్లియరెన్స్ గంటల వ్యవధిలో పూర్తవుతుంది.
ఇప్పటి వరకు చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) విధానంలో చెక్కులు స్కాన్ చేసి బ్యాచ్‌లుగా పంపించేవారు. ఈ విధానంలో టీ+1 అంటే తదుపరి పని దినానికి డబ్బు ఖాతాలోకి వస్తుంది. కానీ కొత్త విధానంలో చెక్కులు తక్షణమే స్కాన్ చేసి క్లియరింగ్ హౌస్‌కు పంపిస్తారు. తద్వారా అదే రోజునే డబ్బు అందే అవకాశం ఉంటుంది.
ఫేజ్‌లుగా అమలు..
ఫేజ్ 1: ఈ నెల 4 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు ఫేజ్ 1 ఉంటుంది. చెక్కులు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు క్లియరింగ్‌కు పంపిస్తారు. రాత్రి 7 లోపు బ్యాంకులు చెక్‌ను అంగీకరించాలి. లేకపోతే ఆటోమేటిక్‌గా ఆమోదం లభిస్తుంది. ఉదయం 11 నుంచి ప్రతి గంటకు సెటిల్మెంట్లు జరుగుతాయి. ఉదయం డిపాజిట్ చేస్తే, సాయంత్రానికి డబ్బు ఖాతాలోకి వస్తుంది
ఫేజ్ 2: వచ్చే ఏడాది జనవరి 3 నుంచి ఫేజ్2 అమల్లోకి వస్తుంది. చెక్కుల నిర్ధారణకు 3 గంటల వ్యవధి మాత్రమే చాలు. ఉదయం 10–11 మధ్య వచ్చిన చెక్కులు మధ్యాహ్నం 2 లోపు క్లియర్ అవుతాయి. కొత్త సిస్టమ్‌తో కస్టమర్లకు డబ్బు త్వరగా అందుతుంది. బౌన్స్డ్ చెక్కుల సమాచారం అదే రోజునే వస్తుంది.
కొత్త సిస్టమ్‌లో అమల్లోకి వచ్చినా, తప్పులు దొర్లకుండా ఉండేందుకు కస్టమర్లు కొన్ని విషయాలను జాగ్రత్తగా పాటించాలి. అమౌంట్, పేయీ, పేయీ నేమ్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఖచ్చితంగా చూసుకోవాలి. మీ బ్యాంక్ యాప్ ద్వారా స్టేటస్ ట్రాక్ చేసుకోవచ్చు.