
కొద్దిరోజులుగా
విజృంభిస్తున్న వైరస్
వానలు, చలి
వాతావరణమే కారణం
విష జ్వరాలతో దవాఖాన్లు ఫుల్
ఫ్లూ మరింత విస్తరించే ప్రమాదముందన్న డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటికే డెంగీ, టైఫాయిడ్, మలేరియా పీడిస్తుండగా కొద్దిరోజులుగా స్వైన్‌ఫ్లూ పంజా విసురుతోంది. నెల రోజులుగా వర్షాలు, చలి వాతావరణం కారణంగా ఆ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. వైద్యారోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారమే.. జూన్ నుంచి ఆగస్టు చివరి నాటికి.. 2 లక్షల 22 వేల 828 మంది శ్వాసకోశ సంబంధిత సమస్యల బారిన పడ్డారు. ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న ఫ్లూ బాధితుల సంఖ్య ఇందుకు మరో ఐదింతలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో స్వైన్ ఫ్లూ (ఇన్‌ఫ్లూయెంజా) అనుమానిత కేసులు పెరగడం ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్‌లో మంగళవారం ఒక్క రోజే 74 మందికి స్వైన్‌ఫ్లూ పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి ‘ఇన్‌ఫ్లూయెంజా ఏ పాజిటివ్’ వచ్చింది. ప్రతి వారం రెండు మూడు కంటే ఎక్కువగానే స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నట్టు ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం జ్వర బాధితులతో దవాఖానాలు కిటకిటలాడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. స్వైన్ ఫ్లూ విస్తరణకు అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యారోగ్యశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రెండే డయాగ్నస్టిక్స్ సెంటర్లు
ఏటా స్వైన్‌ఫ్లూ కేసులు అధికంగా నమోదవుతున్న టాప్–10 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఏటా సగటున వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. కానీ మన రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ పరీక్షలు చేయగల సామర్థ్యమున్న డయాగ్నస్టిక్ సెంటర్లు కేవలం రెండే ఉన్నాయి. హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్‌లో ఒకటి, నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం) క్యాంపస్‌లో మరో ల్యాబ్ ఉన్నాయి. ఎన్‌సీడీసీ (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) లెక్కల ప్రకారం.. ఈ రెండు మినహా రాష్ట్రవ్యాప్తంగా సర్కారు, ప్రైవేటు హాస్పిటళ్లలో స్వైన్‌ఫ్లూ పరీక్షలు చేసే ల్యాబ్ లేదు. సర్కారు దవాఖాన్లకు వచ్చే స్వైన్ ఫ్లూ అనుమానిత కేసుల బ్లడ్ శాంపిళ్లను ఫీవర్ హాస్పిటల్ ల్యాబ్‌కు, ప్రైవేటు నుంచి వచ్చే శాంపిళ్లను ఐపీఎం ల్యాబ్‌కు పంపించి టెస్టులు చేయిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసుల సంఖ్య వేలల్లో ఉండడం, ల్యాబ్‌లు రెండే ఉండడంతో వ్యాధి నిర్ధారణలో ఆలస్యమవుతోంది.
సాధారణంగా చలికాలంలో (అక్టోబర్ నుంచి) స్వైన్‌ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతాయి. కానీ ఈసారి ఆగస్టు నుంచే వైరస్ (హెచ్1ఎన్1) ఉనికి పెరగడం ఆరోగ్యశాఖను కలవరపెడుతోంది. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ యోగితారాణా బుధవారం ఈ విషయంపై సంబంధిత అధికారులను ఆరా తీసినట్టు తెలిసింది. దవాఖానాల నిండా రోగులు ఉండడం, వినాయక చవితి, నిమజ్జనంతో జనాలు ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉండటంతో ఫ్లూ విస్తరణ ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులకు ఫ్లూ తొందరగా సోకుతుందని.. వైరల్ ఫీవర్ల బారిన పడి రోగ నిరోధకశక్తి తగ్గిన పేషెంట్లకు వైరస్ త్వరగా వ్యాపించే అవకాశముందని చెప్తున్నారు.
దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి
దేశవ్యాప్తంగా కూడా స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గతేడాది మొత్తంగా 15,266 కేసులు, 1,128 మరణాలు సంభవించాయి. ఈ ఏడాది సెప్టెంబర్ తొలివారం నాటికే 27,505 కేసులు నమోదుకాగా.. 1,137 మంది మరణించినట్టు లెక్కలు చెప్తున్నాయి. గత ఏడాది మన రాష్ట్రంలో 1,007 కేసులు, 28 మరణాలు సంభవించగా.. ఈ ఏడాది ఇప్పటికే 1,286 కేసులు నమోదై, 20 మంది చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధికంగా రాజస్థాన్‌లో 5,052 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవగా.. గుజరాత్ (4,832), ఢిల్లీ (3,583) తర్వాతి స్థానాల్లో, 1,286 కేసులతో తెలంగాణ ఏడో స్థానంలో ఉన్నాయి.