3నెలల్లో పైప్డ్ గ్యాస్ కు మారాలి.. లేకుంటే LPG కనెక్షన్ కట్: కేంద్రం ప్రకటన

3నెలల్లో పైప్డ్ గ్యాస్ కు మారాలి.. లేకుంటే LPG కనెక్షన్ కట్: కేంద్రం ప్రకటన
  • పైప్డ్  గ్యాస్ ఉన్న చోట పీఎన్​జీకి షిఫ్ట్ కావాలి.. 
  • 3 నెలల్లో మార్చుకోకపోతే ఎల్పీజీ కనెక్షన్ తొలగిస్తం: కేంద్రం ప్రకటన

పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్​జీ) సౌకర్యం అందుబాటులో ఉన్నచోట ఎల్​పీజీ నుంచి పీఎన్​జీకి షిఫ్ట్ కావాలని కేంద్రం సూచించింది. ఇందుకు 3 నెలలు గడువు ఇచ్చింది. ఈ గడువులోపు షిఫ్ట్​ కాకపోతే గృహాలకు ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ సరఫరాను నిలిపివేస్తామని ప్రకటించింది.

న్యూఢిల్లీ: పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్​జీ) సౌకర్యం అందుబాటులో ఉన్నచోట ఎల్​పీజీ నుంచి పీఎన్​జీకి షిఫ్ట్ కావాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు మూడు నెలలు గడువు ఇచ్చింది. ఈ గడువులోపు షిఫ్ట్​ కాకపోతే గృహాలకు ఎల్‌‌‌‌పీజీ సరఫరాను నిలిపివేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. మీ ప్రాంతంలో పీఎన్​జీ కనెక్షన్ అందుబాటులో ఉండి.. మీరు దాన్ని తీసుకోకపోతే, మూడు నెలల తర్వాత మీకు ఎల్​పీజీ సరఫరా నిలిచిపోతుంది. 

అయితే, సాంకేతిక కారణాల వల్ల మీ ఇంటికి పైపులైన్ కనెక్షన్ ఇవ్వడం సాధ్యం కాకపోతే, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్​ఓసీ) తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్​తీసుకుంటే ఎల్​పీజీ సరఫరా కొనసాగుతుంది. గ్యాస్ పైపులైన్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను విస్తరించడం, పైపులైన్ లేని ప్రాంతాలకు ఎల్​పీజీ సిలిండర్లను మళ్లించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, నివాస సముదాయాల్లో పీఎన్​జీ దరఖాస్తులకు 3 రోజుల్లోగా అనుమతి ఇవ్వాలని, దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే కనెక్షన్ పూర్తి చేయాలని అధికారులకు సూచించింది. నిర్ణీత గడువులోగా అధికారులు అనుమతి ఇవ్వకపోతే, అది మంజూరైనట్టుగానే పరిగణించడం జరుగుతుందని తెలిపింది.

రీఫిల్ బుకింగ్ వదంతులపై స్పష్టత

ఎల్​పీజీ రీఫిల్ బుకింగ్ విషయంలో వదంతులపై కేంద్ర  ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రీఫిల్ బుకింగ్ సమయాల్లో ఎటువంటి మార్పులు లేవని ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల నిబంధన యథాతధంగా కొనసాగుతుందని పేర్కొంది. అలాగే, దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్​పీజీ కొరత ఏమీ లేదని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి సంస్థలు స్పష్టం చేశాయి. ప్రజలు ఆందోళన చెందవద్దని, సోషల్ మీడియా వార్తలను నమ్మొద్దని కోరాయి.