
న్యూఢిల్లీ: ఇండియా, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్‌టీఏ) మధ్య వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు సభ్య దేశమైన స్విట్జర్లాండ్ కూడా తాజాగా ఆమోదం తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ ఒప్పందాన్ని అమలులోకి తెచ్చేందుకు మార్గం సుగమమైంది. 16 ఏళ్ల చర్చల తర్వాత ఈ ఏడాది మార్చిలో ఇండియా, ఈఎఫ్‌టీఏ దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈఎఫ్‌టీఏలో ఐస్‌లాండ్, లీచెన్‌స్టీన్, నార్వే, స్విట్జర్లాండ్ సభ్య దేశాలుగా ఉన్నాయి.
స్విట్జర్లాండ్ మినహా మిగిలిన దేశాలు ఇండియాతో ఒప్పందానికి గతంలోనే ఆమోదం తెలిపాయి. వాణిజ్య అడ్డంకులను తగ్గించుకోవడానికి, పెట్టుబడులను పెంచుకోవడానికి ఈ ఒప్పందం సాయపడుతుంది. స్విస్ రాయబారి మాయా టిస్సాఫీ ఈ ఆమోదాన్ని ద్వైపాక్షిక సంబంధాల్లో “మైలురాయి” గా అభివర్ణించారు. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్ (టీఈపీఏ) వలన ఇండియాలోకి రాబోయే 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల (రూ.8.6 లక్షల కోట్ల) పెట్టుబడులు వస్తాయని, 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు.
స్విస్ రిఫరెండమ్ గడువు ముగియడంతో ప్రజలు ఈ ఒప్పందాన్ని ఆమోదించినట్టు అయ్యిందని టిస్సాఫీ తెలిపారు. స్విట్జర్లాండ్ భారత్‌లో 12వ అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. 2024 నాటికి ఈ దేశం నుంచి వచ్చిన పెట్టుబడులు రూ. లక్ష కోట్లకు చేరాయి. ఈ ఒప్పందం అక్టోబర్ నుంచి అమలులోకి వస్తుంది. 330 స్విస్ కంపెనీలు భారత్‌లో ఇంజనీరింగ్, రసాయనాలు, ఫార్మా రంగాల్లో బిజినెస్ చేస్తున్నాయి, భారత కంపెనీలు స్విట్జర్లాండ్‌లో ఐటీ, ఫార్మాలో ఉన్నాయి.