టీ20ల్లో లోయెస్ట్ స్కోరు నమోదు

టీ20ల్లో లోయెస్ట్ స్కోరు నమోదు

బీబీఎల్‌‌లో సిడ్నీ థండర్​ చెత్త రికార్డు

సిడ్నీ: టీ20 క్రికెట్​లో మరో సంచలనం నమోదైంది. ఓ జట్టు 15 రన్స్​కే ఆలౌటైంది. దీంతో  షార్ట్​ ఫార్మాట్​ చరిత్రలో అతి తక్కువ స్కోరు రికార్డయింది. కేవలం 5.5 ఓవర్లలో.. 30 నిమిషాల్లోనే ఈ ఇన్నింగ్స్​ ముగిసింది. ఇంత చెత్త రికార్డును మూటగట్టుకున్నది అనామక జట్టు కాదు. ఐపీఎల్​తర్వాత ఆ స్థాయి పోటీ ఉండే బిగ్‌‌ బాష్‌‌ లీగ్‌‌లో మాజీ విన్నర్‌‌ సిడ్నీ థండర్​. శుక్రవారం అడిలైడ్​ స్ట్రయికర్స్ తో మ్యాచ్‌‌లో థండర్​ ఇన్నింగ్స్‌‌ పేకమేడను తలపించింది. దీంతో ఈ పోరులో అడిలైడ్‌‌ 124 రన్స్​ తేడాతో నెగ్గింది.

తొలుత అడిలైడ్​ 20 ఓవర్లలో 139/9 స్కోరు చేసింది. క్రిస్​ లిన్​ (36), గ్రాండ్​హోమ్‌‌ (33) రాణించారు. ఛేజింగ్​లో సిడ్నీ థండర్​ కేవలం 5.5 ఓవర్లలో 15 రన్స్​కే కుప్పకూలింది. మెన్స్​ టీ20ల్లో షార్టెస్ట్​ ఇన్నింగ్స్​గా ఇది రికార్డులకెక్కింది. అడిలైడ్​ బౌలర్లు హెన్రీ థోర్న్‌‌టన్‌‌​ (5/3), వెస్​ ఎగర్​ (4/6) దెబ్బకు సిడ్నీ బ్యాటర్లు పెవిలియన్​కు క్యూ కట్టారు. డోగెట్​ (4) టాప్​ స్కోరర్. టీమ్‌‌లో ఐదుగురు డకౌటయ్యారు. హేల్స్‌‌ (0), రొసో (3), సామ్స్‌‌ (1) వంటి పేరున్న ప్లేయర్లున్న థండర్​ అనూహ్యంగా బోల్తా కొట్టింది. 2019లో కాంటినెంటల్​ కప్​లో భాగంగా చెక్​ రిపబ్లిక్​తో జరిగిన మ్యాచ్​లో టర్కీ 21 రన్స్​కే ఆలౌటవడం ఇప్పటిదాకా అతి తక్కువ స్కోరు. ఆ రికార్డును థండర్​​ బ్రేక్​ చేసింది.