సిరియా అధ్యక్ష భవనం వద్ద ఆత్మాహుతి 

సిరియా అధ్యక్ష భవనం వద్ద ఆత్మాహుతి 
  • అనుమానాస్పద ప్రవర్తన చూసి అడ్డుకున్న అధికారులు.. తనను తాను పేల్చేసుకున్న సూసైడ్ బాంబర్
  • అడ్డుకున్న ఇద్దరు అధికారులతోపాటు ఆత్మాహుతి దళ సభ్యుడి మృతి

డమాస్కస్: సిరియా రాజధానిలో ఉగ్రవాది ఘాతుకానికి పాల్పడ్డాడు. దేశాధ్యక్షుడు అసద్ నివసించే భనవంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆత్మాహుతి దళ సభ్యుడు.. ఇద్దరు సెక్యూరిటీ అధికారులు అడ్డుకోవడంతో గేటు వద్ద తనను తాను పేల్చుకున్నాడు. దీంతో ఆత్మాహుతి దళ సభ్యుడితోపాటు అతన్ని పట్టుకుని బంధించే ప్రయత్నం చేసిన ఇద్దరు అధికారుల మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. 
దేశాధ్యక్షుడి భవనాన్ని టార్గెట్ చేసిన ఆత్మాహుతి దళ సభ్యుడు గేటు వద్ద నిలబడి లోపలికి వెళ్లేందుకు అనుమతి కోసం వేచి చూస్తున్నాడు. అయితే అతని కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో భద్రతా సిబ్బంది అతడి వద్దకు చేరుకుని  అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. డజన్ల సంఖ్యలో వేచి ఉన్న సందర్శకులు హఠాత్తుగా జరిగిన మానవబాంబు పేలుడుతో భయంతో వణికిపోయారు. ఆత్మాహుతి దళ సభ్యుడితో పాటు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు భద్రతా అధికారులు కూడా మృతి చెందడంతో అక్కడి నుంచి దూరంగా పారిపోయే ప్రయత్నం చేశారు. ఆత్మాహుతి దళ సభ్యుడు సెక్యూరిటీ అధికారులతో వాగ్వాదానికి దిగి.. వారు తనను బంధించడంతో పేల్చేసుకున్న వీడియో అక్కడి కెమెరాల్లో రికార్డయింది.