ఆయుష్మాన్ భారత్ పథకానికి నిధుల్లేవ్.. ఆగస్టు7 నుంచి వైద్యసేవలు నిలిపివేత!

ఆయుష్మాన్ భారత్ పథకానికి నిధుల్లేవ్.. ఆగస్టు7 నుంచి వైద్యసేవలు నిలిపివేత!

ఆదాయం లేని నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఆయుష్మాన్ భారత్.. ఈ పథకం ఇప్పుడు నిర్వీర్యమైపోతోంది. నిధులు కేటాయించకపోవడంతో వైద్య సేవలు అందించేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు ససేమిరా అంటున్నాయి. హర్యానాలో ఆగస్టు 7 నుంచి ఆయుష్మాన్ భారత్ పథకం కింద వైద్య సేవలు నిలిపివేయనున్నాయి. వివరాల్లోకి వెళితే.. 

ఆగస్టు 7నుంచి హర్యానాలో సుమారు 650 ప్రైవేట్ ఆస్పత్రులు ఆయుష్మాన్ భారత్ పథకం కింద వైద్య సేవలు నిలిపివేయనున్నారు. దాదాపు 500 కోట్ల బకాయిలు చెల్లించకపోవడమే దీనికి  ప్రధాన కారణం. ఇం డియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) హర్యానా యూనిట్ ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో హర్యానాలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద వైద్యసేవలు అందకుండా పోయే ప్రమాదం ఉంది. 

మార్చి నుంచి ఆస్పత్రులకు చెల్లించాల్సిన మొత్తంలో కేవలం 10-నుంచి 15% మాత్రమే రీయింబర్స్‌మెంట్లు అందినట్లు IMA తెలిపింది. దీని వల్ల ఆసుపత్రులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.నిధులు సకాలంలో అందకపోవడంతో చాలా ఆస్పత్రులు నగదు కొరతతో సతమతమవుతున్నాయి. కొన్ని ఆసుపత్రులు ఇప్పటికే రోగులను వెనక్కి పంపడం లేదా తమ సొంతంగా ఖర్చు చేసుకోవాలని సూచిస్తున్నాయి. 

గతంలో జనవరిలో కూడా IMA ఇలాంటి హెచ్చరికనే జారీ చేసింది. అయితే ప్రభుత్వ హామీల తర్వాత దానిని ఉపసంహరించుకుంది. ఈసారి వైద్యులు తమకు ఇక ఓపిక లేదని పరిస్థితి మునుపటి కంటే దారుణంగా ఉంది అని చెబుతున్నారు.

ఆలస్యంగా చెల్లింపులు జరగడమే కాకుండా రీయింబర్స్‌మెంట్ మొత్తంలో ఎటువంటి వివరణ లేకుండానే కోతలు విధిస్తున్నారని ఆస్పత్రులు ఆరోపిస్తున్నాయి. కొత్త పోర్టల్‌లో తిరిగి నమోదు చేసుకునే నెపంతో అనేక ఆస్పత్రుల NABH ప్రోత్సాహకాలు కూడా తగ్గించారని అంటున్నారు. 

హర్యానాలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద 1300 ఆస్పత్రులు నమోదు అయ్యాయి. వాటిలో 650 ప్రైవేట్ ఆసుపత్రులే. ప్రైవేట్ ఆస్పత్రుల సేవలను నిలిపివేయడం వల్ల వేలాది మంది తక్కువ ఆదాయం ఉన్న రోగులకు కీలకమైన ఆరోగ్య సేవలు అందకుండా పోయే ప్రమాదం ఉంది.