
- రాణించిన డాసున్ షనక
- సూపర్ - 4 లో లంకేయులు
దుబాయ్: ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు అద్భుతం చేశారు. కుసాల్ మెండిస్ (37 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 60), డాసున్ షనక (33 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45) చెలరేగడంతో.. గురువారం జరిగిన గ్రూప్–బి లీగ్ మ్యాచ్‌లో లంక 2 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచి సూపర్–4లోకి ప్రవేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 183/7 స్కోరు చేసింది. అఫిఫ్ హోస్సేన్ (39) టాప్ స్కోరర్. తర్వాత లంక 19.2 ఓవర్లలో 184/5 స్కోరు చేసింది. ఎబాదత్ హోస్సేన్ 3 వికెట్లు తీసినా బంగ్లాను గెలిపించలేకపోయాడు. కుసాల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
మిరాజ్, అఫిఫ్ షో
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఓపెనర్లలో మెహిదీ హసన్ మిరాజ్ (26 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 38) నిలకడగా ఆడారు. లంక పేస్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగాడు. అయితే రెండో ఎండ్‌లో శబ్బీర్ రెహమాన్ (5) విఫలంకావడంతో బంగ్లా 19 రన్స్‌కే తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో షకీబల్ (24) కాసేపు పోరాడాడు. ఫలితంగా పవర్‌ప్లేలో బంగ్లా 55/1 స్కోరు చేసింది. అప్పటివరకు నిలకడగా ఆడిన హసన్.. ఏడో ఓవర్‌లో వెనుదిరగడంతో రెండో వికెట్‌కు 39 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
ఏడు బాల్స్ తేడాలో ముష్ఫికర్ (4) కూడా ఔట్‌కావడంతో బంగ్లా ఇన్నింగ్స్ తడబడింది. ఈ దశలో వచ్చిన అఫిఫ్ హోస్సేన్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. రెండో ఎండ్‌లో షకీబ్ మూడు ఫోర్లు బాదడంతో ఫస్ట్ టెన్‌లో బంగ్లా 85/3 స్కోరుతో నిలిచింది. ఇక ఫర్వాలేదనుకుంటున్న తరుణంలో లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ.. అనూహ్యంగా షకీబ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మహ్మదుల్లా (27)తో జతకలిసిన అఫిఫ్.. లంకేయులను ఆడుకున్నాడు. హసరంగ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో రెచ్చిపోయాడు. 15వ ఓవర్‌లో మహ్మదుల్లా కూడా సేమ్ సీన్ రిపీట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో మళ్లీ అఫిఫ్ సిక్స్, ఫోర్ దంచాడు.
17వ ఓవర్‌లో మరో ఫోర్ కొట్టి అఫిఫ్ వెనుదిరగడంతో ఐదో వికెట్‌కు 6.1 ఓవర్లలో 57 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. రెండు బాల్స్ తర్వాత మహ్మదుల్లా కూడా పెవిలియన్‌కు చేరాడు. మొసద్దేక్ రెండు ఫోర్లు బాదినా, 19వ ఓవర్ మెహిదీ హసన్ ఔటయ్యాడు. లాస్ట్ ఓవర్‌లో మొసద్దేక్ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 17 రన్స్ రాబట్టాడు. ఓవరాల్‌గా లాస్ట్ ఆరు ఓవర్లలో బంగ్లా 74 రన్స్ చేయడంతో మంచి టార్గెట్‌ను నిర్దేశించింది.
సూపర్ ఛేజింగ్...
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో శ్రీలంకకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు పాతుమ్ నిసాంక (20), కుసాల్ మెండిస్ తొలి వికెట్‌కు 45 రన్స్ జోడించారు. ఈ దశలో పుంజుకున్న బంగ్లా బౌలర్లు చకచకా వికెట్లు తీసి లంకను కట్టడి చేశారు. ఓ ఎండ్‌లో మెండిస్ నిలకడగా ఆడినా.. రెండో ఎండ్‌లో చరిత అసలంక (1), డాసున్ గుణతిలక (11), బానుకా రాజపక్స (2) వరుస విరామాల్లో ఔటయ్యారు. ఫలితంగా లంక 77/4తో కష్టాల్లో పడింది.
లోయర్ ఆర్డర్‌లో డాసున్ షనక మెరుగ్గా ఆడటంతో లంక మళ్లీ తేరుకుంది. మెండిస్‌తో కలిసి ఐదో వికెట్‌కు 54 రన్స్ జోడించి టీమ్‌ను విజయంవైపు తీసుకెళ్లాడు. చివర్లో హసరంగ (2) విఫలమయ్యాడు. ఇక లంక గెలవాలంటే ఆఖరి 18 బాల్స్‌లో 34 రన్స్ అవసరమైన దశలో షనక ఔట్‌కావడంతో లంక శిబిరంలో ఉత్కంఠ మొదలైంది. 12 బాల్స్‌లో 25 రన్స్ విజయసమీకరణాన్ని ఛేదించే క్రమంలో చామిక కరుణరత్నె (16) రనౌటయ్యాడు.
ఈ ఓవర్‌లో 17 రన్స్ రావడంతో ఆఖరి ఓవర్‌లో విజయానికి 8 రన్స్ అవసరమయ్యాయి. మహీశ్ (0 నాటౌట్)తో కలిసి అసితా ఫెర్నాండో (10 నాటౌట్) ఓ బౌండరీతో విజయాన్ని పూర్తి చేశాడు.