రేషన్​ డీలర్లకు ‘టీ వాలెట్’

రేషన్​ డీలర్లకు ‘టీ వాలెట్’

పౌరసేవలను గ్రామీణ ప్రజానీకానికి మరింత చేరువలోకి తీసుకువచ్చేందుకు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘టీ వాలెట్​’ను  అందుబాటులోకి తీసుకురానున్నది. రంగారెడ్డి జిల్లా రూరల్​ ఏరియాల్లో ఉన్న రేషన్​ షాపుల్లో  టీ వ్యాలెట్​ను ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 919 రేషన్​ షాపులు ఉండగా, వాటిలో అర్బన్​ ఏరియాలో 218, రూరల్​ ఏరియాల్లో 701 ఉన్నాయి. ప్రాధమికంగా రూరల్​ ఏరియాల్లోని రేషన్​షాప్​ డీలర్ల వద్ద  టీవాలెట్​ను ప్రవేశపెట్టారు.

రేషన్​ డీలర్లకే ప్రత్యేకం

గ్రామీణ ప్రాంతాల్లో బిల్లుల చెల్లింపులకు వీలుగా  టీ వ్యాలెట్ ను రేషన్​ డీలర్లకే పరిమితం చేశారు. రేషన్​ షాపులు సరుకుల పంపిణీ కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుంది. మిగతా 15 రోజులు డీలర్లకు ​ఆన్​లైన్​ పేమెంట్​ సర్వీసులను ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.  రేషన్​ డీలర్లకు పూర్తి స్థాయిలో పనికల్పించాలనే ఉద్దశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం టీ-వాలెట్‌‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్​రంజన్​ టీ వ్యాలెట్​ను జూన్​ ఒకటో తేదీన ప్రారంభించారు. దీని సాంకేతికత అంశాలపై ఆర్డీవో ఆఫీసుల్లో శిక్షణ ఇచ్చారు. జూన్​ 25 నుంచి రంగారెడ్డి రూరల్​ రేషన్​ షాపుల్లో పైలెట్​ ప్రాజెక్టుగా అమలుచేస్తున్నారు.

అన్ని రకాల చెల్లింపులు…

టీ వాలెట్​ ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన నల్లబిల్లులు, కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, మొబైల్​ బిల్లులు, ఫోన్​ రీఛార్జీలు, రైల్వే టిక్కెట్​ బుకింగ్​ వంటి సదుపాయాలను పొందవచ్చు.    పట్టణ ప్రాంతాలకు వెళ్లి పన్నుల చెల్లింపులకు వీలులేకుండా గ్రామీణ ప్రాంతాల్లోనే టీ వ్యాలెట్​ ద్వారా చెల్లించే అవకాశం అందుబాటులోకి వస్తుంది. దీంతో సమయం వృధా కాకపోవడమే కాకుండా నిర్ణీత సమయంలో చెల్లింపులకు అవకాశం ఉంటుంది.  వినియోగదారులు చెల్లించే బిల్లలను బట్టి డీలర్లకు కమిషన్​ ఇస్తారు. ఒక్కొక్క ట్రాన్​జాక్షన్​కు కనీసం రూ.2.50ల నుంచి రూ.4ల వరకు ప్రాసెసింగ్​ ఫీజును వసూలు చేసుకునే వెసలుబాటును ప్రభుత్వం కల్పించింది.