టీ20 వరల్డ్ కప్ తరలింపు లాంఛనమే

టీ20 వరల్డ్ కప్ తరలింపు లాంఛనమే
  • యూఏఈకి తరలించాలని నిర్ణయం
  • టీ20 వరల్డ్‌‌కప్‌‌ టోర్నీ తరలింపు లాంఛనమే
  • నవంబర్‌లో కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలు
  • ఇండియా వచ్చేందుకు ఫారిన్‌‌ టీమ్స్‌‌ వెనుకంజ
  • ఇప్పటికే బ్యాకప్‌‌ వెన్యూగా యూఏఈని ఎంచుకున్న బీసీసీఐ

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు ఐపీఎల్‌‌ వాయిదా పడడంతో ఇండియా ఆతిథ్యం ఇచ్చే టీ20 వరల్డ్‌‌కప్‌‌పై కూడా అనుమానాలు నెలకొన్నాయి. ఐపీఎల్‌‌ వాయిదా తర్వాత ఈ మెగా టోర్నీని ఇండియా నుంచి తప్పించి యునైటెడ్‌‌ అరబ్‌‌ ఎమిరేట్స్‌‌ (యూఏఈ)కి తరలించడం ఖాయమైనట్టే అనిపిస్తోంది. టోర్నీ జరిగే నవంబర్‌‌లో కరోనా థర్డ్‌‌ వేవ్‌‌ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఇండియా వచ్చేందుకు ఇతర దేశాల జట్లు ఇష్టపడడం లేదని బీసీసీఐ అధికారులే చెబుతున్నారు. దాంతో,  వరల్డ్‌‌కప్‌‌ను యూఏఈకి షిఫ్ట్‌‌ చేయడం లాంఛనమే అన్న అభిప్రాయాలు వస్తున్నాయి. దీనిపై నెల రోజుల్లో తుది నిర్ణయం రానుంది. వాస్తవానికి టీ20 వరల్డ్‌‌కప్‌‌ను దృష్టిలో ఉంచుకునే ఐపీఎల్‌‌14ను  బీసీసీఐ ఇండియాలో నిర్వహించింది. ఆరు వేదికల్లో లీగ్‌‌ను సక్సెస్‌‌ చేయడం ద్వారా వరల్డ్‌‌కప్‌‌నకు మార్గం సుగమం చేయాలని భావించింది. కానీ, ఐపీఎల్‌‌ కోసం ఏర్పాటు చేసిన పటిష్ట బయో బబుల్‌‌లో కరోనా కేసులు వెలుగు చూడడంతో  అక్టోబర్‌‌–నవంబర్‌‌లో 16 జట్లు పోటీపడే వరల్డ్‌‌కప్‌‌ కోసం రిస్క్‌‌ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తున్నారని సమాచారం. ఇంకా  డేట్స్‌‌  ఖరారు కాని మెగా టోర్నీ కోసం బీసీసీఐ తొమ్మిది నగరాలను షార్ట్‌‌లిస్ట్‌‌  చేసింది. కరోనా సెకండ్‌‌ వేవ్‌‌ నేపథ్యంలో ఆతిథ్య నగరాలను ఐదుకు కుదించడంతో పాటు చివరి ఆప్షన్‌‌గా యూఏఈని బ్యాకప్‌‌గా ఎంచుకుంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో  ఐదు నగరాల్లో నిర్వహణ కూడా సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై బోర్డు అధికారులు.. సెంట్రల్‌‌ గవర్నమెంట్‌‌లోని ముఖ్యులతో  చర్చలు జరిపారని, టోర్నీని యూఏఈకి షిఫ్ట్‌‌ చేయడానికి దాదాపు అంగీకరించాని సమాచారం. ‘ఐపీఎల్‌‌ను నాలుగు వారాల్లోనే నిలిపివేయాల్సి వచ్చింది. గడచిన 70 ఏళ్లలో  ఎప్పుడూ లేనంత తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంతో ఇండియా పోరాడుతోంది. ఇలాంటి టైమ్‌‌లో ఓ ఇంటర్నేషనల్ ఈవెంట్‌‌ను నిర్వహించడం సురక్షితం కాదు.  నవంబర్‌‌లో  కరోనా థర్డ్‌‌ వేవ్‌‌  ముప్పు కూడా ఉంది.  కాబట్టి ఆతిథ్య బోర్డుగా వ్యవహరిస్తూనే బీసీసీఐ ఈ టోర్నీని యూఏఈకి షిఫ్ట్‌‌ చేయొచ్చు’ అని బోర్డు సీనియర్‌‌ అధికారి ఒకరు చెప్పారు.  పరిస్థితి సాధారణ స్థితికి రాకపోతే   పెద్ద దేశాలేవీ వచ్చే  ఆరు నెలల దాకా ఇండియాకు రావన్నారు. కాబట్టి టోర్నీని యూఏఈకి తరలించడానికి బోర్డు ఒప్పుకుంటుందని అభిప్రాయపడ్డారు. ‘ కరోనా సెకండ్‌‌ వేవ్‌‌లో కూడా  టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడానికి ఇండియా సురక్షితం అని ప్రపంచానికి,  పోటీపడే దేశాలకు చెప్పడానికి  ఐపీఎల్‌‌ ఓ ప్లాట్‌‌ఫామ్‌‌గా కనిపించింది. కానీ, అంతా సవ్యంగా సాగుతున్న టైమ్‌‌లో బయో బబుల్‌‌ బద్ధలైంది. అక్టోబర్‌‌–నవంబర్‌‌లో మరోసారి ఇలా జరగదని గ్యారంటీ ఏంటి?’  ఆయన ప్రశ్నించారు. యూఏఈలో మూడు గ్రౌండ్స్‌‌ రెడీగా ఉండడం, షార్జా, దుబాయ్‌‌, అబుదాబి మధ్య విమానాల్లో కాకుండా రోడ్డు మార్గాన ట్రావెల్‌‌ చేసే వీలు ఉండడంతో టోర్నీని ఎడారి దేశంలో నిర్వహించేందుకు అతి పెద్ద సౌలభ్యంగా భావిస్తున్నారు. అయితే,  ఏడాది చివర్లో జరిగే వరల్డ్‌‌కప్‌‌పై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని బోర్డు పెద్దలు అంటున్నారు. ఈ నేపథ్యంలో జూన్‌‌లో  జరిగే  ఐసీసీ మీటింగ్‌‌లో మెగా టోర్నీపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.