
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారీ స్కూళ్లలో చదువుతున్న 20 వేల మందికిపైగా స్టూడెంట్లు ట్రావెలింగ్ అలవెన్స్ (టీఏ) కోసం ఎదురుచూస్తున్నారు. రోజూ ఆటోలు, జీపులు, బస్సుల్లో సొంత పైసలు ఖర్చు పెట్టుకుని వస్తున్నామని.. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. గతేడాది (2018–19 విద్యా సంవత్సరం)కి సంబంధించి ప్రభుత్వం ఒక్కపైసా కూడా విడుదల చేయలేదని, దాంతో పేరెంట్స్ అప్పు చేసి, తమను బడికి పంపాల్సి వస్తోందని వాపోతున్నారు.
విద్యా హక్కు చట్టం మేరకు..
రాష్ట్రంలో 26,054 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వీటిలో 20 లక్షల మందికిపైగా స్టూడెంట్లు చదువుతున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం బడి ఈడు పిల్లల్ని బడికి రప్పించేలా సర్కారు చర్యలు తీసుకోవాలి. అందుకోసం వారుంటున్న ఆవాసాల్లోనే స్కూళ్లు ఏర్పాటు చేయాలి. ఒకవేళ ఆ సౌకర్యం కల్పించకపోతే.. సమీపంలోని స్కూళ్లకు వెళ్లేందుకు ట్రావెలింగ్ అలవెన్స్ (టీఏ) ఇవ్వాలి. విద్యా హక్కు చట్టం నిబంధనల ప్రకారం.. స్టూడెంట్లకు కిలోమీటర్ లోపు దూరంలో ప్రైమరీ స్కూలు, మూడు కిలోమీటర్లలోపు అప్పర్ ప్రైమరీ, ఐదు కిలోమీటర్ల లోపు దూరంలో హైస్కూల్ ఉండాలి. అంతకన్నా ఎక్కువ దూరంలో బడి ఉంటే ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలి. ఈ మేరకు 8వ తరగతిలోపు స్టూడెంట్లకు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) కింద టీఏ చెల్లిస్తున్నారు. అందులో కేంద్రం 60 శాతం నిధులిస్తే.. రాష్ట్రం 40 శాతం మ్యాచింగ్ గ్రాంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. 2017–18 విద్యా సంవత్సరం వరకూ ఒక్కో స్టూడెంట్‌కు నెలకు రూ.300 చొప్పున.. ఏడాదికి (వేసవి, ఇతర సెలవులు పోగా) రూ. మూడు వేలు ఇచ్చేవారు. 2018–19 నుంచి నెలకు రూ.600కు, ఏడాదికి రూ.6 వేలకు పెంచారు. అయితే గతేడాదికి సంబంధించిన టీఏ ఇప్పటికీ అందలేదు. కేంద్రం నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతోనే టీఏ చెల్లించడం లేదని తెలుస్తోంది.
ఏడాదికోసారి ఇస్తూ..
2018–19 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రంలో 29 జిల్లాల పరిధిలోని 1,862 హ్యాబిటేషన్స్ పరిధిలో స్కూళ్లు లేవని అధికారులు గుర్తించారు. ఆ హ్యాబిటేషన్స్‌లో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు 5,024 మంది, యూపీఎస్ విద్యార్థులు 15,730 మంది ఉన్నారని లెక్క తేల్చారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1,575 మంది ఉండగా.. మహబూబ్‌నగర్‌లో 1,513 మంది, మహబూబాబాద్‌లో 1,300, నల్లగొండలో 1,216 మంది, సిద్దిపేటలో 1,072 మంది ఉన్నారు. అత్యల్పంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 141 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వారంతా ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేటు వాహనాల్లో బడికి వస్తున్నారు. వాస్తవానికి నెలనెలా టీఏ ఇవ్వాలి. కానీ ప్రభుత్వం ఏడాది మొత్తం టీఏను ఒకేసారి ఇస్తూ వస్తోంది.
జీవో ఇచ్చినా..
గత విద్యాసంవత్సరం (2018–19) ప్రారంభంలోనే 20,754 మంది స్టూడెంట్స్‌కు రూ.12.45 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. కానీ నిధులు విడుదల కాలేదు. స్టూడెంట్లు సొమ్ము అందక ఇబ్బంది పడుతున్నారు. ఇక 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి 20,012 మందిని టీఏకు అర్హులుగా గుర్తించి.. రెండు నెలల కిందే రూ.12 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వులివ్వడం గమనార్హం. కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికే మంజూరు చేస్తున్నట్టుగా ఉత్తర్వులు ఇస్తున్నారని.. క్షేత్రస్థాయిలో నిధులు విడుదల చేయడం లేదని టీచర్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. గతేడాది టీఏ బకాయిలను, ఈ ఏడాది సొమ్మును వెంటనే స్టూడెంట్లకు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాయి.