నేడు ఓయూ 83వ కాన్వొకేషన్ .. పాస్​పై ఒక్కరికే ఆడిటోరియంలోకి ఎంట్రీ 

నేడు ఓయూ 83వ కాన్వొకేషన్ .. పాస్​పై ఒక్కరికే ఆడిటోరియంలోకి ఎంట్రీ 
  • 979 మందికి పీహెచ్​డీ పట్టాలు, 45 మంది స్టూడెంట్లకు గోల్డ్​ మెడల్స్ 
  • పీహెచ్​డీ పట్టా అందుకోనున్న ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సీతక్క

ఓయూ,వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ 83వకాన్వొకేషన్​కు ఠాగూర్ ​ఆడిటోరియం సిద్ధమైంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే కాన్వొకేషన్​కు గవర్నర్​తమిళిసై హాజరు కానున్నారు.   వివిధ విభాగాల్లో పీహెచ్​డీలు పూర్తి చేసిన 979 మందికి పట్టాలు అందజేయనున్నారు.  వీరిలో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సీతక్క ​కూడా ఉన్నారు. టాపర్స్​గా నిలిచిన 45 మంది స్టూడెంట్లు  57 గోల్డ్ మెడల్స్ అందుకోనున్నారు.  

గోల్డ్ మెడల్స్ అందుకునే  స్టూడెంట్లతో  పాటు మరొకరికి మాత్రమే పాస్​ జారీ చేసిన అధికారులు.. పీహెచ్​డీ పట్టాలు అందుకునే వారి వెంట వచ్చే సహాయకులకు పర్మిషన్ ఇవ్వలేదు.  1,200 మంది సీటింగ్ ​కెపాసిటీ కలిగిన ఠాగూర్ ఆడిటోరియంలో స్టూడెంట్లకు వెయ్యి సీట్లు ఏర్పాటు చేశారు.   మీడియాకు కేవలం 30 పాస్​లు మాత్రమే జారీ చేసిన అధికారులు 24 సీట్లు మాత్రమే కేటాయించారు.  పట్టాలు అందుకునే స్టూడెంట్లు, పాస్​లున్న వారు ఆడిటోరియానికి మధ్యాహ్నం ఒంటిగంటన్నర లోపు చేరుకోవాలని అధికారులు సూచించారు.   

కెమెరాలకు నో ఎంట్రీ 

 కాన్వొకేషన్​ ప్రోగ్రామ్​ను కవర్ ​చేసేందుకు వచ్చే మీడియా కెమెరాలు, ఫొటోగ్రాఫర్లకు ఆడిటోరియంలోకి అనుమతి ఇవ్వలేదు. తామే రికార్డు చేసి అందజేస్తామని, వర్సిటీ ప్రత్యేక లింక్​ ద్వారా లైవ్​లో ప్రోగ్రామ్​ను  టెలికాస్ట్ చేస్తామని అధికారులు వెల్లడించారు. పీహెచ్​డీ పట్టాలు, గోల్డ్​మెడల్స్ ​అందుకున్న వారిని ఆడిటోరియం బయటకు వచ్చాక ఇంటర్వ్యూలు చేసుకోవచ్చని, లోపలికి మాత్రం కెమెరాలను, సెల్​ఫోన్లను సైతం అనుమతించబోమని చెప్పారు.