పెళ్లిళ్లకు తహశీల్దార్ అనుమతి

పెళ్లిళ్లకు తహశీల్దార్ అనుమతి

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో  కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మ్యారేజ్ లకు ఎంతమందిని అనుమతించాలనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు పెళ్లిళ్ల అనుమతి విషయంలో కలెక్టర్‌ నుంచి అనుమతి పొందాల్సి వచ్చేది. దీని కారణంగా అనుమతులు ఆలస్యం అవుతుండడంతో ఇకపై ఈ వ్యవహారాలను తహశీల్దార్ కు  అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ముఖ్యంగా జులై 21 నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుండడంతో పెద్ద ఎత్తున వివాహాలు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్‌ స్థాయిలో మ్యారేజ్ లకు  పర్మిషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే పెళ్లిళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, మిగతా ఎటువంటి ఫంక్షన్లకు అనుమతి ఇచ్చేది లేదని ప్రభుత్వ నిబంధనల్లో తెలిపింది. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె తరపున కేవలం ఇరవై మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో చెప్పింది. పెళ్లిళ్ల అనుమతి కోరే వారు తప్పని సరిగా వివాహ శుభలేఖతో పాటు, నాన్‌ జ్యూడిషియల్‌ స్టాంప్‌ పై అఫిడవిట్‌ ను తహశీల్దార్ కు సమర్పించాల్సి ఉంటుందని, దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా ఆధార్‌ కార్డు తో పాటు, కరోనా పరీక్షలు చేయించుకున్నట్టుగా డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్లను జత చేయాలని ప్రభుత్వం జీవోలో తెలిపింది. ఈ నిబంధనలు ఉల్లంఘింస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 లోని సెక్షన్‌ 188 ద్వార కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టంగా తెలిపింది.