
- ఐటీఐపీలో కంపెనీలు పెడతామన్న 11 సంస్థల ఎలీజియన్స్ గ్రూప్
- తైవాన్‌లో రాష్ట్ర ప్రతినిధి బృందంతో భేటీ
- ఫ్యూచర్ సిటీలో మరో 250 ఎకరాలు కేటాయించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీలో రూ.2వేల కోట్లతో ఇంటర్నేషనల్ టెక్నాలజీ, ఇండస్ట్రీస్ పార్క్ (ఐటీఐపీ) ఏర్పాటు చేసేందుకు తైవాన్‌కు చెందిన ఎలీజియన్స్ గ్రూప్ ముందుకొచ్చింది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు రాష్ట్ర అధికారుల బృందం తైవాన్ రాజధాని తైపీలో పర్యటిస్తున్నది. అందులో భాగంగా గురువారం మన బృందంతో 11 సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఐటీఐపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఐటీఐపీకి సర్కారు ఇప్పటికే కొంగరకలాన్‌లోని ఎలక్ట్రానిక్స్ పార్క్‌లో 15 ఎకరాల భూమి కేటాయించింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మరో 250 ఎకరాలు కేటాయించాలని ఆయా కంపెనీల ప్రతినిధులు రాష్ట్ర ప్రతినిధులను కోరారు. భూమిని కేటాయించిన వెంటనే పారిశ్రామికవాడ అభివృద్ధి పనులు మొదలు పెడతామని స్పష్టం చేశారు. రాబోయే మూడేండ్లలో మొదటి దశలో భాగంగా రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెడ్తామన్నారు.
దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. ‘‘ఈ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ పార్కులో ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్లేట్ల పరిశ్రమల లాంటి ఉన్నత స్థాయి సాంకేతిక ఉత్పత్తులు తయారవుతాయి. దేశీయ అవసరాలతో పాటు భారీ పరిమాణంలో ఎగుమతులు జరుగుతాయి. ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా నిపుణులను అందుబాటులో ఉంచుతాం’’ అని రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ వింగ్ కమాండర్ డా.సూర్యకాంత్ శర్మ.. తైవాన్ ప్రతినిధులకు వివరించారు. తెలంగాణాలో ప్రతిభావంతులైన మానవ వనరుల లభ్యతతో అత్యంత అనుకూల పారిశ్రమిక వాతావారణం ఉందని ప్రతినిధుల గ్రూప్ చైర్మన్ సైమోన్ లీ ఈ సందర్భంగా అన్నారు.
తైవాన్ నిపుణుల కోసం అక్కడి సంస్కృతి ఉట్టిపడేలా ఫర్మోసా టౌన్ పేరుతో ఒక కమ్యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు వెల్లడించారు. త్వరలో రాష్ట్రంలో పర్యటించి సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబుకు తమ అభివృద్ధి ప్రణాళికను వివరిస్తామని తెలిపారు. ఒప్పంద కార్యక్రమంలో తైవాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ హో చు-న్సిన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియా తైపీ అసోసియేషన్ మన్హర్ సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.