మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సత్తుపల్లి, వెలుగు: గత పాలకులు అశాస్త్రీయంగా జిల్లాలను విభజించారని, దానిని శాస్త్రీయంగా క్రమబద్ధీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ లో కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డితో కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాల విభజన విషయంలో ఓ మాజీ మంత్రి ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామంటున్న ఆయన వ్యాఖ్యలను ప్రజలు గమనించాలని కోరారు. అగ్నిగుండం చేయడం వాళ్లకి తెలిసిన విద్య అయితే, తాము నీళ్లు చల్లి చల్లార్చుతామని తెలిపారు.
పంచాయతీ ఎన్నికల్లో అరకొర స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్ధులు గెలుపొందితేనే ఆ పార్టీ నాయకులు రోడ్ల మీద పిచ్చికుక్కల్లా ఎగురుతున్నారని, ప్రజలు ప్రతీది గమనిస్తున్నారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తామే గెలుస్తున్నామని కారుకూతలు కూసిన ఓ మాజీ మంత్రికి నవీన్ యాదవ్ గెలుపుతో మాట పడిపోయిందని ఎద్దేవా చేశారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో సెమీఫైనల్స్ అంటూ ఇప్పుడు మళ్లీ మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ అదే పాట పాడుతున్నారన్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 69 శాతం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మట్టా దయానంద్, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, నాయకులు శివ వేణు, గాదె చెన్నారావు, చల్లగుల్ల నరసింహారావు, కమల్ పాషా పాల్గొన్నారు.
నదీ జలాలపై చర్చ అంటే అసెంబ్లీ నుంచి పారిపోయిన్రు..
మహబూబాబాద్: కృష్ణ నదీ జలాలపై చర్చ అంటే వాస్తవాలు బయటికి వస్తాయని బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ నుంచి పారిపోయారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. మహబూబాబాద్ లో ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
కృష్ణ నదీ జలాల వాటాలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. కృష్ణ, గోదావరి నదీ జలాలు వినియోగించుకునేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మానుకోట కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటిదని, సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీలను కాంగ్రెస్ కు కట్టబెట్టిన చరిత్ర కలిగి ఉందన్నారు.
జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. సీఎం సలహాదారుడు వేంనరేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహబూబాద్ పట్టణంలో రూ.180 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు భూక్య ఉమ, ఎంపీ పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్ పాల్గొన్నారు.
