బండ్ల అమ్మకాలు భేష్! 2024తో పోలిస్తే 5 శాతం జంప్

బండ్ల అమ్మకాలు భేష్! 2024తో పోలిస్తే 5 శాతం జంప్
  • గతేడాది 44.89 లక్షల వెహికల్స్​అమ్మకం.. 2024తో పోలిస్తే ​5 శాతం జంప్

న్యూఢిల్లీ:  మనదేశ ఆటోమొబైల్ కంపెనీలు 2025 క్యాలెండర్ సంవత్సరంలో సత్తా చాటాయి. కంపెనీల నుంచి డీలర్లకు వెళ్లే ప్యాసింజర్ వెహికల్స్​ పంపిణీ (డిస్పాచ్​లు) గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయికి చేరుకుంది. జీఎస్టీ సంస్కరణల వల్ల ధరలు తగ్గడం, పండుగ డిమాండ్​తో అమ్మకాలు పెరిగాయి.  ప్యాసింజర్ వెహికల్స్​ (పీవీ) హోల్ సేల్స్​ ఐదు శాతం పెరిగి 44,89,717 యూనిట్లకు చేరుకున్నాయి. 2024లో 42,74,793 యూనిట్లు అమ్ముడుపోయాయి. యుటిలిటీ వెహికల్స్​ పంపిణీ ఏడు శాతం వృద్ధితో 29,54,279 యూనిట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాదిలో 27,49,932  బండ్లు డిస్పాచ్​అయ్యాయి. ప్యాసింజర్ కార్ల విక్రయాలు స్వల్పంగా పెరిగి 13,79,884 యూనిట్లకు చేరాయి. వ్యాన్ల డిస్పాచ్​ ఒక శాతం పెరిగింది. త్రీవీలర్స్​, కమర్షియల్​ వెహికల్స్ (సీవీ) రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. 

త్రీ వీలర్లకూ డిమాండ్​

త్రీ వీలర్​సేల్స్​ ఎనిమిది శాతం పెరిగి 7,88,429 యూనిట్లకు చేరింది. 2024 లో ఈ సంఖ్య 7,28,670 యూనిట్లుగా ఉంది. సీవీల అమ్మకాలు ఎనిమిది శాతం వృద్ధితో 10,27,877 యూనిట్లకు చేరాయి. టూవీలర్ల​ అమ్మకాలు ఐదు శాతం వృద్ధితో 2,05,00,639 యూనిట్లుగా నమోదయ్యాయి. 2024 లో ఈ విక్రయాలు 1,95,43,093 యూనిట్లుగా ఉన్నాయి. భారత ఆటో పరిశ్రమకు 2025 ఒక చారిత్రాత్మక ఏడాది అని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర పేర్కొన్నారు.  గత ఏడాది ఎగుమతుల్లోనూ రెండంకెల వృద్ధి సాధించామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే సానుకూల వాతావరణం కొనసాగుతుందని, 2026 లో కూడా అమ్మకాల జోరు ఉంటుందని చంద్ర ధీమా వ్యక్తం చేశారు.  ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్ లోనూ అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉన్నాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్పారు.