తాజ్ మహల్‎కు బాంబ్ బెదిరింపు కలకలం.. ఆర్డీఎక్స్‎తో పేల్చేస్తామని వార్నింగ్

తాజ్ మహల్‎కు బాంబ్ బెదిరింపు కలకలం.. ఆర్డీఎక్స్‎తో పేల్చేస్తామని వార్నింగ్

ఆగ్రా: ప్రపంచ ప్రసిద్ధ కట్టడాలల్లో ఒకటైన తాజ్ మహల్‎కు బాంబ్ బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. తాజ్ మహల్‎ను ఆర్డీఎక్స్‎తో పేల్చేస్తామని గుర్తు తెలియని దుండగుడు శనివారం (మే 24) యూపీ టూరిజం కార్యాలయానికి ఈమెయిల్ పంపాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు తాజ్ మహల్ వద్ద హై అలర్ట్ ప్రకటించారు. 

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), తాజ్ సెక్యూరిటీ పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, టూరిజం పోలీసులు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులు దాదాపు మూడు గంటల పాటు తాజ్ మహల్ ప్రాంగణాన్ని జల్లెడ పట్టారు. ఎలాంటి అనుమానస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో వచ్చింది ఫేక్ మెయిల్ అని నిర్ధారించుకుని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బెదిరింపు మెయిల్ రాగానే తాజ్ మహల్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పర్యాటకులను అనుమతించలేదు.  

కాగా, శనివారం (మే 24) ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖకు, ఢిల్లీ పోలీసులకు కేరళ నుంచి సవ్వకు శంకా అనే గుర్తు తెలియని మెయిల్ ఐడీ నుండి బెదిరింపు మెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఇందులో.. మధ్యాహ్నం 3:30 గంటల నాటికి తాజ్ మహల్‌ను ఆర్డీఎక్స్‎తో పేల్చివేస్తామని హెచ్చరించారని వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ ఇమెయిల్ ఫేక్ అని తెలిందని చెప్పారు. 

ఈ మేరకు సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.  మెయిల్‌ పంపించింది ఎవరనే దానిపై దర్యాప్తు జరుపుతున్నామని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బాంబ్ బెదిరింపు నేపథ్యంలో పర్యాటకులపై ఆంక్షలు విధించామని.. పెన్నులు తీసుకెళ్లడంపై నిషేధం విధించామని చెప్పారు.