ఫీల్డ్ అసిస్టెంట్లను   విధుల్లోకి తీస్కోండి

ఫీల్డ్ అసిస్టెంట్లను   విధుల్లోకి తీస్కోండి

కేంద్రానికి ఆప్ నేతల విజ్ఞప్తి  

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం తొలగించిన 7,651 మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఆప్ నేతలు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ నాగేంద్ర నాథ్ సింహాను ఆప్ సౌతిండియా ఇన్​చార్జ్ సోమ్​నాథ్ భారతి, ఆప్ రాష్ట్ర నేత ఇందిరా శోభన్ కలిసి వినతి పత్రం అందించారు. తర్వాత వారు మాట్లాడారు. ఉపాధి హామి పథకంలో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా జీతాలు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో14 ఏండ్లుగా 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేశారని చెప్పారు. రెండేండ్ల కిందట.. వేతనాలు పెంచాలని, బకాయిలు చెల్లించాలని, అదనపు పనిభారం పెంచుతూ తెచ్చిన జీవో 4779ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సమ్మె చేయడంతో ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించిందన్నారు. కరోనా కష్ట కాలంలోనైనా విధుల్లోకి తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదన్నారు. అసలు ఈ విషయం ఇప్పటివరకూ తమ దృష్టికి రాలేదని కేంద్ర సెక్రటరీ నాగేంద్ర నాథ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని నేతలు చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.