
కాగజ్‌నగర్, వెలుగు: ‘పోలీసులు నాకు అన్యాయం చేస్తున్నారు.. లంచం తీసుకొని నా ప్రత్యర్థులకు మద్దతు పలుకుతూ నాపైనే కేసు పెట్టారు.. ఎస్పీ సారు.. మాకు న్యాయం చేయండి’ అంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి సెల్ఫీ తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. వివరాల్లోకి వెళ్తే.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం పాత సార్సాల గ్రామానికి చెందిన పాముల శ్రీనివాస్, లింగయ్య మధ్య భూ వివాదం నెలకొంది. ఈ విషయంపై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. లింగయ్య కుటుంబ సభ్యులు సైతం ఈస్గాం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
దీనిపై విచారణ జరిపిన పోలీసులు లింగయ్య ఫ్యామిలీకే మద్దతు ఇస్తూ తమపైనే కేసులు పెడుతున్నారని శ్రీనివాస్ సెల్ఫీలో చెప్పాడు. గ్రామస్తులంతా తమకు అనుకూలంగానే సాక్ష్యాలు చెప్పినా పోలీసులు అవతలి వర్గంవారికే మద్దతు ఇస్తున్నారని ఆరోపించాడు. ఎస్పీ స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ పురుగుల మందు తాగాడు. ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో ఫార్వార్డ్ చేయడంతో గమనించిన స్థానికులు అతడిని కాగజ్‌నగర్‌లోని హాస్పిటల్‌లో జాయిన్ చేయగా.. ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.