బీఎల్ఓలుగా స్వీపర్లా?...ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల ఆఫీసర్ కు మాజీ మంత్రి తలసాని లెటర్లు

బీఎల్ఓలుగా స్వీపర్లా?...ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల ఆఫీసర్ కు మాజీ మంత్రి తలసాని లెటర్లు
  •     ఓటరు సవరణ వదిలేసి, జన గణన చేస్తున్నరు  
  •      అస్సలు అవగాహన లేని  సిబ్బందిని నియమించారు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రోగ్రామ్​లో ఓటరు సవరణ వంటి కీలక బాధ్యతలను నిర్వహించేందుకు సరైన అవగాహన లేని సిబ్బందిని నియమించారని, చివరకు స్వీపర్లను కూడా బూత్ లెవల్ ఆఫీసర్లుగా (బీఎల్ఓ) నియమించారని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​యాదవ్​విమర్శించారు. ‘సర్’ లో తప్పులు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ కు లెటర్లు రాశారు. ఈ లేఖలను బుధవారం బీఆర్ఎస్ లీడర్లుపవన్ కుమార్ గౌడ్ సదరు అధికారులకు అందజేశారు. 

ఇంటింటికీ తిరుగుతలేరు

సిబ్బంది ఇంటింటికీ తిరిగి సర్వే చేయాల్సి ఉండగా, ఆ పని చేయడం లేదని తలసాని లెటర్​లో పేర్కొన్నారు. యాప్​లో వివరాల నమోదు, మ్యాపింగ్ ప్రక్రియపై  సిబ్బందికి అవగాహన లేకపోవడం వల్ల ప్రక్రియ  సరిగ్గా కొనసాగటం లేదన్నారు. కొంతమంది సిబ్బంది ఓటరు సవరణను వదిలేసి, జన గణన నిర్వహిస్తున్నారని, దీనివల్ల ప్రజలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారన్నారు. 

తాను బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఈ ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. ఇప్పుడు జనగణన జరుగుతుందా?  ఓటరు సవరణ జరుగుతుందా? అనే విషయంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి, ఓటర్లలో ఉన్న అయోమయాన్ని తొలగించాలని  డిమాండ్ చేశారు. 

లీడర్లు చెప్తే ఓట్లు తీసేస్తున్నరు

చాలా ప్రాంతాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎలాంటి విచారణ చేయకుండానే, రాజకీయ నాయకులు చెప్పిన విధంగా ఓట్లను తొలగించటం, చేర్చటం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికెళ్లి చేయాల్సిన సవరణ నేతల ఇండ్లల్లో కూర్చొని చేస్తున్నారన్నారు. 

సర్ ప్రక్రియకు సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్లు పూర్తిగా రాజకీయ నాయకులపై ఆధారపడి నిర్వహించకుండా ఓట్లు తొలగించాల్సి వస్తే, దానికి ప్రజాస్వామ్య బద్దమైన ప్రక్రియను అమలు చేసేలా బీఎల్ఓలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని  కోరారు.