జై భీమ్​ కోసం అడవిలో తిరిగా

జై భీమ్​ కోసం అడవిలో తిరిగా

ఒక సినిమాలో టెస్టికల్​ (వృషణ) క్యాన్సర్​తో బాధపడుతూ  ప్రేమను అన్వేషించే యువకుడిగా, ఇంకో సినిమాలో తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లడం ఇష్టం లేని కొడుకుగా, మరో సినిమాలో అవినీతికి బానిసైన పోలీస్​గా, ‘జై భీమ్’లో పోలీస్​ల చిత్రహింసలకు బలైన అమాయక ఇరులార్ గిరిజనుడిగా... ఇలా కె.మణికంఠన్​ తమిళ సినిమా ఇండస్ట్రీలో రియలిస్టిక్ పాత్రలు ఎంచుకుంటున్నాడు. అన్నింటికిమించి మణికంఠన్​ అద్భుతమైన రచయిత. ఎన్నో కష్టాలకు ఓర్చుకుని, ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మణికంఠన్​ జర్నీ ఇది.

‘‘ఈ మధ్యనే ‘సిల నెరంగళిల్ సిల మణిధర్గళ్’ సినిమా విడుదలైంది. ఈ మూవీలో నటించడంతో పాటు రచయితగా కూడా పని చేశా. తమిళంలో ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు కొన్ని అద్భుతమైన స్క్రిప్ట్స్ చదువుతున్నా. త్వరలోనే వాటిని స్క్రీన్ మీదకు తీసుకొస్తా. వాటిలో నటిస్తా, రచయితగానూ పని చేస్తా. అయితే ఇప్పటికీ నా మీద ‘జై భీమ్’లో చేసిన రాజకన్ను పాత్ర ప్రభావం ఉంది. ‘జై భీమ్’ దేశవ్యాప్తంగా నాకు మంచిపేరు తీసుకొచ్చింది.

రెండు నెలలు అక్కడే ఉన్నా

రాజకన్ను క్యారెక్టర్​ని రియలిస్టిక్​గా ప్రజెంట్ చేయడం కోసం ఇరులార్ గిరిజన గ్రామంలో రెండు నెలలు ఉన్నా. ఒకరిపై ఆధారపడకుండా ఎలా బతకాలో, వాళ్లను చూసి నేర్చుకున్నా. వాళ్లతో ఉండటం వల్ల నాకు కూడా కొన్ని లైఫ్ స్కిల్స్ ఒంటబట్టాయి. ముందుగా ఆ ఊళ్లోకి అడుగుపెట్టగానే నన్ను వేటకు తీసుకెళ్లారు వాళ్లు. వేటకోసం మైళ్లకొద్దీ దూరం నడుస్తారు. సాయంత్రం ఆరు గంటలకు నడక మొదలుపెడితే, పొద్దున ఆరు గంటల వరకు రాత్రంతా నడుస్తూనే ఉంటారు. వాళ్లకు ఉన్నంత శక్తి మనకు ఉండదు. ఎలుకలు పట్టడం, కుందేళ్లకు ఉచ్చులు పెట్టడం, అడవి పందులకు వలలు వెయ్యడం... ఇలా అన్ని వేటలు నేర్పించారు. వాళ్ల దగ్గర కార్లు, బంగ్లాలు, ఉద్యోగాలు లేవు. అయినా సరే వాళ్లు చాలా సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండాలనుకునే వాళ్లు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారని వాళ్లను చూశాక బాగా అర్థమైంది. రాజకన్ను పాత్ర మేకప్ వేసుకునేందుకు రెండు గంటలు పట్టేది.  నా ఒంటి మీద గాయాల్ని పెట్టడానికి ఎక్కువ టైం పట్టేది. షూటింగ్​ అయిపోయాక మేకప్ తీయడానికి రెండు గంటలు పట్టేది.

ఫ్యామిలీలో చదువుకుంది నేనే

నేను పుట్టి పెరిగింది అడయార్​లో. అయితే, అది అందరికీ తెలిసిన అడయార్ కాదు. అడయార్​కు మరోవైపు కూడా ఉంది. దాని చుట్టూ పేదరికం కాపు కాస్తుంటుంది. మా ఫ్యామిలీలో ఆరో తరగతి కన్నా ఎక్కువ చదివింది నేను ఒక్కడినే.  నేను బాగా చదువుతానని మా నాన్నకు తెలుసు. అందుకే, తన శక్తికి మించి నన్ను ఇంజినీరింగ్ చదివించాడు. మా అమ్మానాన్నకు నాపై చాలా ఆశలు ఉండేవి. ఇంజినీరింగ్ అయిపోయాక ‘జాబ్ లెస్’ ట్యాగ్​తో నన్ను ఈ ప్రపంచం ఎగతాళి చేస్తుంటే, అమ్మ నాకు సపోర్ట్​గా నిలబడింది. బయటి వాళ్లకు సమాధానం చెప్పేటప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడినా, ఇంట్లో మాత్రం ఏడ్చేది. ‘నా కొడుకు ఏమైపోతాడో’ అనే భయం ఆమెది. ‘వచ్చే సంవత్సరమైనా సెటిల్ అవుతావా?’ అని అమ్మ అడిగితే నా దగ్గర సమాధానం ఉండేది కాదు. ‘నీ క్లాస్ మేట్ కారు కొన్నాడు. విదేశాల్లో సెటిల్ అయ్యాడు’ అని చెప్తుంటే స్ట్రెస్ ఫీలయ్యేవాడిని. మా నాన్న మాత్రం  సైలెంట్​గా నన్ను సపోర్ట్ చేసేవారు. నేను బద్ధకస్తుడిని కాదని ఆయనకు బాగా తెలుసు. అదొక్కటే కాదు వాళ్లకు అర్థంకాకపోయినా నేను దేనికోసమో పనిచేస్తున్నా అని అయితే ఆయనకు బాగా తెలుసు.
 

మిమిక్రీతో కెరీర్ ప్రారంభం

చదువు అయిపోయాక, ఆర్ట్ పై ఫోకస్ పెట్టాలా? ఇంజినీరింగ్ మీద ఫోకస్ పెట్టాలా? అని డైలమాలో పడ్డా. నా మనసు ఒక దాని మీద ఉండదు. అటు ఇటు మారుతుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే చంచలం అన్నమాట. ‘రెండేళ్లు ఆర్ట్స్​లో కెరీర్ ట్రై చెయ్యి, అక్కడ నీ వల్ల కాకపోతే తిరిగి ఇంజినీరింగ్ వైపు వచ్చేయ్’ అని నా ఫ్రెండ్స్ చెప్పారు. ‘సరే’ అని ట్రై చేయడం మొదలుపెట్టా. 2009 నుంచి 2011 వరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. కానీ, రిజెక్షన్​ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నా. ‘నీ వయసు 20 ఏండ్లే. నీకు మెచ్యూరిటీ లేదు. నువ్వు యాక్టింగ్ చెయ్యలేవు’ అని చెప్పి పంపించేవాళ్లు. కానీ, చిన్నప్పటి నుంచి మిమిక్రీ బాగా చేసేవాడ్ని. ఆ మిమిక్రీతోనే నా కెరీర్ మొదలైంది. స్టేజీలపై మిమిక్రీ చేయడం మొదలుపెట్టా. తర్వాత  ఒక ఎఫ్ ఎం ఛానెల్​లో రేడియో జాకీగా పని చేసే అవకాశం వచ్చింది. రేడియో జాకీగా చేస్తూనే కొన్ని సినిమాలు, టీవీ షోలు, కార్టూన్స్​కి డబ్బింగ్ చెప్పా.‘102 డాల్మేషియన్స్’ తమిళ డబ్బింగ్ వెర్షన్​లో ఫేమస్ అయిన తండ్రి పాత్రకు డబ్బింగ్ చెప్పినప్పుడు నా గురించి తెలిసింది. రజనీకాంత్ వాయిస్​ని స్టేజీల మీద ఎన్నో సార్లు మిమిక్రీ చేశా. అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు ‘ అంత ఈజీగా ఛాన్స్ రావడానికి, నువ్వేమైనా రజనీకాంత్ కొడుకువా?’ అని ఎగతాళి చేసేవాళ్లు. కానీ,  ‘కాలా’ సినిమాలో ఆయన కొడుకుగా నటించే అవకాశం వచ్చింది. పా. రంజిత్ స్క్రిప్ట్ చదివాక రజనీ సర్ కొడుకుగా నటించాలని తెలిసిన క్షణం నుంచి భయమేసింది. కానీ, రంజిత్ సర్ నాలో భయాన్ని పోగొట్టి నన్ను యాక్ట్​ చేయించారు.

కామెడీ స్క్రిప్ట్స్ రాశా

నలన్ కుమారస్వామి ‘ఇయక్కునార్’ కోసం  కొన్ని సినిమాల్లో పని చేయాలని పిలిచారు. ఎవరినీ అడగకుండా నన్ను ప్రూవ్​ చేసుకునేందుకు అదే పెద్ద అవకాశం అనుకున్నా. అది చాలా పెద్ద ప్లాట్ ఫామ్. నేను మాత్రమే కాదు, నాలా యాక్టింగ్ కలలు కనే చాలామంది అక్కడ ఉన్నారు. వాళ్లందరినీ చూశాక ఒంటరిని కాననే భావన కలిగింది. రోడ్డు పక్కన టీ తాగుతూ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. అప్పుడే ‘జీవితం’ అనే పెద్ద టీచర్ నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టా. నేనేంటి? నాలో ఏముంది? అని విశ్లేషించుకోవడం మొదలుపెట్టా. టీవీ సీరియల్స్​కి, కార్టూన్స్​కి డబ్బింగ్ చెప్పడంతో పాటు షోలతో బిజీ అయిపోయా.

ఫస్ట్ ఛాన్స్

2013లో విడుదలైన ‘పిజ్జా-2’ సినిమాకి రచయితగా అవకాశం వచ్చింది. నటన పరంగా చూస్తే 2015లో వచ్చిన ‘ఇండియా పాకిస్తాన్’ నా మొదటి సినిమా. తర్వాత ‘కాదలుం కాదందు పోగుం’ సినిమాలో చిన్న పాత్ర చేశా. అప్పుడే విజయ్ సేతుపతితో గడిపే అవకాశం వచ్చింది. అతను ఎవరు? ఎలా కష్టపడి హీరో అయ్యాడు అనే విషయాలు తెలుసుకున్నా. ఇద్దరం అన్నదమ్ముల్లా మారిపోయాం. విజయ్ అన్న ‘విక్రమ్ వేద’ లో డైలాగ్స్ రాయడానికి పుష్కర్- గాయత్రికి నన్ను రికమండ్ చేశారు. ‘మణి చాలా టాలెంటెడ్. బాగా రాస్తాడు. అంతకన్నా బాగా చదువుతాడు’ అని వాళ్లకు చెప్పారు. దాంతో వాళ్లను కలిసిన పది నిమిషాల్లోనే నన్ను టీంలోకి తీసుకున్నారు. నేను పుస్తకాలు చదవడం ఎప్పుడూ మానలేదు. అదే నేను మంచి రచయితగా ప్రశంసలు పొందడానికి కారణమైంది. 2017లో విక్రమ్ వేదాకి డైలాగ్స్ రాయడంతో పాటు, అందులో పోలీసు కానిస్టేబుల్ పాత్ర చేశా. ఆ తర్వాత ‘కాలా’, ‘విశ్వాసం‘, ‘తంబి’, ‘సిల్లు కరుపట్టి’, ‘ఏలే’ సినిమాలు నాకు మంచి పేరు తీసుకొచ్చాయి.  ‘నారై ఎళుతుం సుయాసరితం’ అనే ఇండిపెండెంట్ మూవీని కూడా డైరెక్ట్ చేశా. అది 2016 బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్​తో పాటు ‘న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్’ కి ఎంపికైంది.

ముందు స్క్రిప్ట్ చదువుతా

నేను స్పాంటేనియస్ యాక్టర్​ని కాదు. ఏ పాత్ర వచ్చినా ముందు స్క్రిప్ట్ మొత్తం చదువుతా. తర్వాత రిహార్సల్స్​ చేస్తా. ఆ తర్వాతే షూటింగ్​ సెట్​లోకి అడుగుపెడతా. ‘సిల్లు కరుపట్టి’ లో వృషణ క్యాన్సర్​తో బాధపడుతున్న వ్యక్తి పాత్ర చేసే అవకాశం వచ్చింది. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి రోల్ చేస్తే అందరూ నవ్వుతారని భయపడ్డా. కానీ, డైరెక్టర్ హలిత నాలో ఆత్మవిశ్వాసం నింపారు. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు దాని లోతు తెలిసేలా రియలిస్టిక్​గా నటించా. ఆ పాత్ర చేసేటప్పుడు నవ్వుతారని భయపడ్డాను కానీ సినిమా విడుదలయ్యాక నా క్యారెక్టర్ మీద ఒక్క నెగెటివ్ కామెంట్​ కూడా రాలేదు.

అదే గౌరవం

ప్రేక్షకులు నా పాత్రను అంగీకరిస్తారా? లేదా? అనే విషయాన్ని మనసులో పెట్టుకొని పని చెయ్యను. నన్ను నేను వివిధ రకాల పరిస్థితుల్లో పెట్టుకొని నటిస్తుంటా. నాకు చాలా అరుదుగా రియాలిటీకి దూరంగా ఉండే పాత్రలు వస్తుంటాయి. చుట్టుపక్కల ఉండే మనుషుల పాత్రలే ఎక్కువ చేస్తా. వాటిని చేయడం ఒక గౌరవం. ఉదాహరణ తీసుకుంటే ఒక వీధిలో కష్టపడే వ్యక్తిని రిప్రజెంట్ చేయడం చాలా ముఖ్యం. అది కృత్రిమంగా ఉండకూడదని భావిస్తా. అది వాళ్ల కథ, వాళ్ల కష్టం. వాళ్ల సంతోషం.. అవన్నీ చాలా నిజాయితీగా కనిపించాలి. ఏ రోల్ చేసినా, అది నమ్మేలా ఉండాలనుకుంటా. ‘కాదలుం కాదందు పోగుం’ మూవీలో నాది డ్రైవర్ పాత్ర. నాకు అప్పుడు డ్రైవింగ్ రాదు. అదే విషయం వాళ్లకు చెప్పి, వెంటనే నా ఫ్రెండ్ కారుతో డ్రైవింగ్ నేర్చుకున్నా. ఆ తరువాతే సెట్​లో  అడుగుపెట్టా.

ఫెయిల్డ్ యూట్యూబర్

యూట్యూబ్ ఛానెల్ పెట్టి పొలిటికల్ సెటైర్ షో ఒకటి మొదలుపెట్టా. కానీ, అది ఫెయిల్ అయింది. రాయడం, నటించడం, వాయిస్, యాక్టింగ్, డైరెక్షన్ ఇవన్నీ నాకు ఇష్టమే.  అందుకే చాలామంది నన్ను ‘నువ్వు ఒక్క విషయం మీద ఫోకస్ ఎందుకు పెట్టవు?’ అని అడుగుతుంటారు. ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను. ఇరవై ఏండ్ల వయసు నుంచి ఈ ప్రశ్న నన్ను వెంటాడుతోంది. నాకిప్పుడు 34. ఆర్టిస్ట్​గా ఎదగడానికి అవన్నీ ముఖ్యమైనవే అని భావిస్తా. అదీకాకుండా అవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఒక మంచి రచయిత కావడానికి, మంచి పర్ఫార్మర్, డైరెక్టర్ కావడానికి అవి సాయపడ్డాయి. వాటిన్నింటి మీద ఆసక్తి ఉండటం, నాకు సంతోషాన్నే ఇస్తోంది. 

... గుణ