డీలిమిటేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం తీర్మానం

డీలిమిటేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం తీర్మానం

చెన్నై: డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తమిళనాడులో విజయ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. మహిళా రిజర్వేషన్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో సీఎం విజయ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వామపక్ష పార్టీలు టీవీకే ప్రభుత్వ తీర్మానానికి మద్దతు తెలిపాయి.

బీజేపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించింది. డీఎంకే ఇప్పటికే డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేసిన సంగతి తెలిసిందే. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే.. తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని టీవీకే అధినేత, సీఎం విజయ్ హెచ్చరించారు.

పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో మహిళా రిజర్వేషన్ల అమలుతో ముడిపెడుతున్న డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో విజయ్ సర్కార్ ఈ తీర్మానం ప్రవేశపెట్టడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రెండు రోజుల్లో కేంద్రం ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టవచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

►ALSO READ | సంక్షేమ పథకాల కోసం లీటర్‌ పెట్రోల్, డీజిల్ 60 పైసలు బాదుడు : ఆ రాష్ట్రం ఏంటో తెలుసుకోండి..!

డీలిమిటేషన్‌పై విజయ్ సర్కార్ ప్రవేశపెట్టిన తీర్మానంలో 3 కీలక డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను కొనసాగించడం, ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం కేటాయించిన స్థానాలను శాశ్వతం చేయడం, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం. ఈ డిమాండ్లతో విజయ్ ప్రభుత్వం డీలిమిటేషన్ను వ్యతిరేకించింది.