ఆ ఊర్లో అసలు చెప్పులేసుకోరు

ఆ ఊర్లో అసలు చెప్పులేసుకోరు

మన దేశంలో ఎన్నో అందమైన ప్రాంతాలున్నాయి.  కొన్నిచోట్ల వింత  ఆచారాలు, విచిత్రమైన సంప్రదాయలు కనిపిస్తుంటాయి. అదే విధంగా ఆ ఊర్లో జనాలు చెప్పులేసుకుని తిరగరు. అడిగితే.. ‘మా కారణాలు మాకున్నాయ్‌‌..’ అంటున్నరు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది? వాళ్లు  చెబుతున్న కారణం ఏంటి?, అసలు ఆ ఊర్లో వాళెట్ల బతుకుతున్నరో చూద్దాం..

తమిళనాడు దిండిగల్‌‌ జిల్లా గుట్టల మీద విస్తరించి ఉంది కొడైకెనాల్‌‌. దీనిని ఆనుకుని ‘వెల్లగావి’ అనే చిన్న గ్రామం ఉంది.  ఇక్కడ నూటయాభైకి పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి.  దట్టమైన అడవిలో చుట్టూ పచ్చదనం, సెలయేర్ల పరవళ్లతో ఎంతో సుందరంగా ఉంటుంది ఈ ఊరు. అయినా కూడా దీనిని టూరిస్ట్‌‌ స్పాట్‌‌లో చేర్చలేదు. అందుకు కారణం ఇక్కడికి రోడ్డు లేకపోవడమే. ఈ ఊరికి వెళ్లాలంటే ట్రెక్కింగ్‌‌ చేయాల్సిందే.
విచిత్రం ఏంటంటే.. ఇక్కడ ఇళ్ల కంటే గుళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ఈ ఊరిని పవిత్రంగా భావిస్తారు ఇక్కడి జనాలు. దేవుళ్లు.. భక్తులు ఒకే ఊళ్లో ఉంటున్నారు కదా. అందుకే  అక్కడి జనాలు చెప్పులేసుకోరు. ఎవరైనా ఈ ఊరికి రావాలంటే చెప్పులు విప్పి ఉత్తికాళ్లతో రావాలి. ఈ సూచనతో కొండ ప్రాంతంలో అక్కడక్కడా టూరిస్ట్‌‌ల కోసం ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.

కష్టమే, కానీ ఇష్టంగా..
వెల్లగావికి మూడు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఊర్లోకి అడుగుపెట్టగానే ఒక పెద్ద గుడి ఎంట్రెన్స్‌‌లో కనిపిస్తుంది. ఇళ్ల మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న గుళ్లు ఉంటాయి. చుట్టూ కొండలు, పచ్చదనం.. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ అక్కడ చదువుకునేందుకు స్కూల్‌‌ లేదు. ఒక చాయ్‌‌ దుకాణం, చిన్న కిరాణ షాప్‌‌ మాత్రమే ఉంటాయి. ఏదైనా అవసరం పడితే కొండలు దాటుకుంటూ కొడైకెనాల్‌‌ వెళ్లాల్సిందే. రోజూ కష్టాలే.
అయినా కూడా ఎంతో ఆనందంగా ఉంటున్నారు వెల్లగావి ప్రజలు.  ఆ సంగతి పక్కనపెడితే ప్రకృతి అందాలతో ట్రెక్కింగ్‌‌కు మాత్రం ఈ ప్రాంతం స్వర్గమనే చెప్పాలి.