అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్..తొలిరోజు సెషన్ లోనే రచ్చ

అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్..తొలిరోజు సెషన్ లోనే రచ్చ
  • తమిళనాడు అసెంబ్లీ సెషన్ ప్రారంభంలో ఘటన
  • జాతీయగీతం పాడలేదని ఆరోపించిన గవర్నర్
  • ప్రసంగం చదవకుండా వెళ్లిపోయిన రవి
  • సమావేశాల తొలి రోజే రచ్చ

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే సభలో రచ్చ చోటుచేసుకుంది. జాతీయగీతాన్ని పాడలేదని సభ నుంచి గవర్నర్  ఆర్ఎన్  రవి వాకౌట్  చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రసంగాన్ని గవర్నర్  చదవాల్సి ఉంది. ముందుగా జాతీయగీతం పాడాలని స్పీకర్ అప్పావును గవర్నర్  కోరారు. కానీ, తమిళనాడు రాష్ట్ర గీతం పాడిన తర్వాత జాతీయ గీతం పాడకుండానే స్పీచ్​ ప్రారంభించారు. 

దీనిపై గవర్నర్ నిరసన తెలుపుతూ  మధ్యలోనే సభ నుంచి వెళ్లిపోయారు. ఆయన వాకౌట్  చేసిన కాసేపటికే ఆయన కార్యాలయం లోక్ భవన్  ఒక ప్రకటన విడుదల చేసింది. గవర్నర్  కోరినా సభలో జాతీయగీతం పాడలేదని, ఇది జాతీయగీతాన్ని అవమానించడమేనని తమిళనాడు ప్రభుత్వంపై మండిపడింది. గవర్నర్​ మైక్రోఫోన్​ను ఆఫ్​ చేశారని విమర్శించింది. 

‘‘రాష్ట్ర ప్రభుత్వ ప్రసంగంలో తప్పుదారి పట్టించే వ్యాఖ్యలే ఉన్నాయి. ఎన్నో సమస్యలతో రాష్ట్ర ప్రజలు సతమతం అవుతున్నారు. కీలక సమస్యల గురించిన ప్రస్తావనే స్పీచ్​లో లేదు” అని లోక్ భవన్  వ్యాఖ్యానించింది.
సంప్రదాయాన్ని గవర్నరే అవమానించారు.

లోక్ భవన్  ప్రకటనకు సీఎం ఎంకే స్టాలిన్  కౌంటర్  ఇచ్చారు. వందేండ్లుగా కొనసాగుతూ వస్తున్న సభా సాంప్రదాయాన్ని గవర్నరే అవమానించారని ఆయన విమర్శించారు. ‘‘మేకకు గడ్డం అవసరమా? మేకకు గడ్డం అవసరంలేనట్లే రాష్ట్రానికి కూడా గవర్నర్  అవసరం లేదు” అన్న డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై వ్యాఖ్యలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్ గుర్తుచేశారు.

 గవర్నర్​ను గానీ, ఆయన ఆఫీసును గానీ తమ ప్రభుత్వం ఎన్నడూ అగౌరవపర్చలేదని ఆయన చెప్పారు. ప్రొటోకాల్  గురించి గవర్నర్​కు ముందే నోటిఫై చేశామని స్పీకర్  అప్పావు తెలిపారు. గవర్నర్  వాకౌట్ చేసినా ఆయన ప్రసంగానికి సంబంధించిన తీర్మానాన్ని సీఎం స్టాలిన్  పాస్  చేశారని స్పీకర్ వివరించారు.

కేరళ అసెంబ్లీలోనూ వివాదం..

కేరళ అసెంబ్లీలో కూడా కాస్త రచ్చ జరిగింది. కేబినెట్ ఆమోదించిన స్పీచ్​లో కొన్ని అంశాలను గవర్నర్  రాజేంద్ర ఆర్లేకర్  చదవలేదని, ఆయన కావాలనే అలా చేశారని సీఎం పినరయి  విజయన్  అన్నారు. ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అంశాలను గవర్నర్ పక్కన పెట్టారని విమర్శించారు. ఆయన వాటిని చదవకున్నా చదివినట్లుగానే భావిస్తామని సీఎం తెలిపారు. రాజ్యాంగం ప్రకారం కేబినెట్  ఆమోదించిన విధానాలే నెగ్గుతాయన్నారు.