తమిళ్ నేషనలిస్ట్ లీడర్ పర నెడుమారన్ సంచలన ప్రకటన చేశారు. LTTE చీఫ్ వెలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడని ప్రకటించారు. కుటుంబసభ్యులతో ప్రభాకరన్ టచ్‌లో ఉన్నారన్న ఆయన.. త్వరలో ప్రజల ముందుకు వస్తారని చెప్పారు. ప్రభాకరన్ చనిపోయినట్టు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని నెడుమారన్ అన్నారు. తాను బతికి ఉన్నట్టు ప్రభాకరనే చెప్పమన్నారని.. అందుకే మీడియా ముందుకు వచ్చినట్టు నెడుమారన్ స్పష్టం చేశారు.
ప్రభాకరన్ చనిపోయారంటూ 14 ఏళ్లుగా సాగుతున్న తప్పుడు ప్రచారానికి తెరదించుతున్నట్లు నెడుమారన్ వెల్లడించారు. ప్రభాకర్ బతికే ఉన్నారని.. త్వరలోనే తన ప్లాన్ వెల్లడిస్తారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులందరూ ఆయనకు మద్దతు తెలపాలని కోరారు. ప్రభాకరన్ ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నారన్న నెడుమారన్ ఆయన ఎక్కడున్నారనే విషయాన్ని ఇప్పుడే వెల్లడించలేనన్నారు. ప్రభాకరన్ సరైన సమయంలో ప్రజల ముందుకు వస్తారన్నారు. ప్రత్యేక తమిళ్ ఈలంను ఏర్పాటు చేయడానికి తన వద్ద ఉన్న స్పష్టమైన ప్రణాళికలను ప్రకటిస్తారని చెప్పారు.
2009లో శ్రీలంక సైన్యంతో జరిగిన యుద్ధంలోLTTE ప్రభాకరన్ చనిపోయారు.ప్రభాకరన్ ను మట్టుబెట్టినట్టు శ్రీలంక అప్పట్లోనే ప్రకటన కూడా విడుదల చేసింది. మృతదేహాన్ని గుర్తించి..అందుకు సంబంధించిన ఫోటోలను బయటపెట్టింది. అయితే 14 ఏళ్ల తర్వాత ప్రభాకరన్ బతికే ఉన్నారని నెడుమారన్ చెప్పడం సంచలనంగా మారింది.
