పొత్తుల కోసం మేం వెంపర్లాడలే : తమ్మినేని

పొత్తుల కోసం మేం వెంపర్లాడలే :  తమ్మినేని

హైదరాబాద్, వెలుగు : చట్టసభల్లో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలని, తమ అభ్యర్థులను అసెంబ్లీకి పంపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్‌‌ఎస్, కాంగ్రెస్‌తో పొత్తుల కోసం తాము వెంపర్లాడలేదని తెలిపారు. బీఆర్ఎస్‌కు మేలు చేయడం కోసమే తాము ఒంటరిగా పోటీ చేస్తున్నామన్న అభిప్రాయాన్ని ఆయన కొట్టిపారేశారు. అనివార్య పరిస్థితుల్లోనే తాము ఒంటరిగా పోటీ చేస్తున్నామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో  టీయూడబ్ల్యూజే నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. కర్నాటక ఫలితాలు, ఇతర కారణాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందన్నారు.

బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న పరిస్థితి నుంచి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ప్రస్తుతం మారిందని పేర్కొన్నారు. బీజేపీ ప్రత్యర్థిగా ఉంటే బీఆర్ఎస్‌కు కమ్యూనిస్టుల అవసరం ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. పొత్తుల పేరుతో కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. పొత్తుల సమయంలో మీరైతే గెలవలేరంటూ కొందరు, కమ్యూనిస్టులతో పొత్తులుంటే నష్టమని మరికొందరు కాంగ్రెస్ నేతలు అవహేళన చేశారన్నారు. ఈ సమావేశంలో ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌ రెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ పాల్గొన్నారు.