
నటుడిగానే కాక రచయితగా, దర్శకుడిగానూ తనదైన ముద్రవేసుకున్నారు తనికెళ్ల భరణి. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారాయన. తాజాగా స్వర్గీయ శ్రీరమణ రాసిన ‘బంగారు మురుగు’నవల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలో తనికెళ్ల భరణి నటిస్తున్నారు.
ఈ సినిమాకు డొక్కా ఫణి దర్శకత్వం వహిస్తుండగా, ఫణీంద్ర గొల్లపల్లి నిర్మిస్తున్నారు. కోనసీమలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
రచయిత శ్రీరమణకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది.ఆయన రాసిన ‘మిథునం’కథ ఎంతో పాపులర్. ఆ కథను అదే పేరుతో తనికెళ్ల భరణి సినిమాగా తెరకెక్కించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ జంటగా నటించిన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. దీంతో ఈ సినిమాపైనా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
తెలుగు సాహిత్యంలో అద్భుతమైన కథలు ఉన్నాయి. అయితే వాటిని ప్రేక్షకామోదకరంగా తెరకెక్కించే దర్శకులే కరువయ్యారు. మన దర్శకులు తెలుగు కథల మీద ఒకసారి దృష్టి సారిస్తే... కథలు కరువు అనే మాటే వినిపించదు.