
హైదరాబాద్, వెలుగు: దేశంలో టెట్ లేని ఇన్ సర్వీస్ టీచర్ల ఉద్యోగ భద్రత, ప్రమోషన్ల అవకాశాలను కాపాడేందుకు విద్యాహక్కు చట్టం సెక్షన్ 23కి సవరణ చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్‌రావు, నవాత్ సురేశ్ కేంద్రాన్ని కోరారు. సోమవారం హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఆ సంఘం నేతలతో పాటు కలిసి వినతిపత్రం అందించారు.
ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇన్ సర్వీస్‌లోని టీచర్లతో పాటు ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై కావాల్సి ఉందని తెలిపారు. ఇది సర్కారుతో పాటు ప్రైవేటు స్కూళ్లలోని టీచర్ల ఉద్యోగ భద్రతకు ప్రమాదంగా మారిందని చెప్పారు. 2009 ఆర్టీఈ చట్టం, 2010లోని ఎన్సీటీఈ నోటిఫికేషన్ ప్రకారం అప్పటి వరకూ అపాయింట్ అయిన వారికి టెట్ నుంచి మినహాయింపు ఉందన్నారు.