ప్రశ్నిస్తే కేసులు పెడ్తరా?

ప్రశ్నిస్తే కేసులు పెడ్తరా?
  • ఒక ఎంపీని గ్యాంగ్​స్టర్​ లెక్క అరెస్ట్ చేస్తరా: తరుణ్​చుగ్​
  • పోలీసులు ఖాకీ డ్రెస్​ తీసి గులాబీ డ్రెస్​ వేసుకోవాలి
  • రాష్ట్రంలో బ్రిటీష్ పాలన నడుస్తున్నది 
  • లీడర్లను టార్గెట్ చేస్తూ టీఆర్​ఎస్​ సర్కార్​ వేధిస్తున్నది
  • ఎంత మందిని జైల్లో పెట్టినా పోరాటం ఆపం
  • ప్రశ్నించినోళ్లపై కేసులు పెడుతున్నరు 
  • కోర్టు ఆదేశాలతో సర్కార్​ తప్పు చేసిందని తేలింది
  • ఉద్యమ సమయంలో కేటీఆర్​ ఏ దేశంలోనో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నడు 

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ సర్కార్ పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ఫైర్ అయ్యారు. కేసీఆర్‌‌... తన నివాసాన్ని రాజ ప్రాసాదంలా భావిస్తున్నారని విమర్శించారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సర్కార్ కొందరు నాయకులను లక్ష్యంగా చేసుకొని వేధిస్తోందని ఆరోపించారు. ‘‘టీఆర్‌‌ఎస్‌‌ పాలనలో ఎవరు ప్రశ్నిస్తే వాళ్లపై క్రిమినల్‌‌ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. మీడియా వాళ్లయినా, రాజకీయ నేతలైనా, ఇంకెవరైనా వరుసగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు” అని మండిపడ్డారు. ఎంతమందిని జైల్లో పెట్టినా, బీజేపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని చెప్పారు. ‘‘తెలంగాణలో సర్కార్ తీరు చూస్తే, భారత్ గడ్డపై విదేశీ రాజ్యం నడుస్తున్నట్లుంది. ఇక్కడ ప్రజాస్వామ్య పాలన సాగడం లేదు. బ్రిటీష్‌‌ పాలన నడుస్తోంది” అని విమర్శించారు. 2014 లో కేసీఆర్ చెప్పిన ఉద్యోగాల హామీ ఏమైందని నిలదీశారు. ‘‘తెలంగాణ కోసం ఆందోళనలు జరుగుతున్న సమయంలో కేసీఆర్‌‌ కొడుకు కేటీఆర్‌‌ ఏ దేశంలోనో ఆరాంగా పని చేసుకునేవాడు. ఇప్పుడేమో తెలంగాణ కోసం ఏదో చేశామన్నట్లు వ్యవహరిస్తున్నాడు” అని విమర్శించారు. 
పోలీసులు టీఆర్ఎస్ జెండా మోస్తున్నరు... 
తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో ఐపీఎస్‌‌ అధికారి చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారని తరుణ్ చుగ్ ఆరోపించారు. ఇదే అధికారి ఇంతకుముందు దురుసుగా ప్రవర్తించారని, ఆయనపై లోక్ సభలో ప్రివిలేజ్ మోషన్ నడుస్తోందని చెప్పారు. ఇప్పుడు మళ్లీ అదే అధికారి.. ఒక ఎంపీ, నేషనల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. సంజయ్ కార్యాలయంలోనే అతనిపై మ్యాన్‌‌ హ్యాండ్లింగ్ చేశారని.. గ్యాస్ కట్టర్ తో గ్రిల్స్ ఊడగొట్టి, తలుపులు పలగ్గొట్టి గ్యాంగ్ స్టార్ దావూద్ ఇబ్రహీంను అరెస్టు చేసినట్లుగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. పోలీసులు గులాబీ గూండాల్లా వ్యవహరించారని, వాళ్లు టీఆర్ఎస్ జెండా మోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఖాకీ డ్రెస్ కు బదులు గులాబీ డ్రెస్ వేసుకోవాలని సూచించారు. సంజయ్‌‌పై తప్పుడు కేసులు పెట్టారని,  కోర్టులో న్యాయం జరిగిందని, హైకోర్టు ఆదేశాలతో సర్కార్ తప్పు చేసిందని స్పష్టమైందన్నారు. మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, విజయరామారావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కొప్పు బాషా పాల్గొన్నారు. 

హైకోర్టు తీర్పు.. 
చెంపపెట్టు: లక్ష్మణ్ 
రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెడుతున్న సీఎం కేసీఆర్ కు హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సంజయ్ పై తప్పుడు కేసు పెట్టారని హైకోర్టు తీర్పు ఇచ్చినందున సీఎం పదవికి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రిమాండ్ రిపోర్టును కోర్టు కొట్టివేసిన విషయాన్ని సర్కార్ గుర్తుంచుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ దళిత మహిళా నేత బొడిగే శోభను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించారు. బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ సర్కార్ భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి కేసీఆర్ కు వణుకు పుడుతోందని, బీజేపీ బలపడుతుండడంతో సీఎంకు నిద్ర కరువైందని ఎద్దేవా చేశారు.